నాడు చంద్రబాబు.. నేడు లోకేశ్.. అడుగులు ప్రగతి దారులు
posted on Nov 7, 2024 11:39AM
ఏపీ అన్ని రంగాల్లో ముందుండాలి.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడాలి.. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు దక్కాలి.. ప్రతి కుటుంబంలో ఒక ఎంట్రపెన్యూర్ ఉండాలి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. పేదరికం లేని రాష్ట్రంలో నిలవాలి. అందుకోసం నేను ఎంతైనా కష్టపడతా.. ఇదీ సీఎం చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. ఆయన కేవలం మాటలకే పరిమితం కాలేదు.. హైదరాబాద్ నగరాన్ని ఐటీకి కేంద్రంగా మార్చిన ఘనత చంద్రబాబుది. దేశంలోనే ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ ఒకటని ఈనాడు చెప్పుకుంటున్నామంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమైంది. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. జనం కూడా అదే చెబుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత.. ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. అమరావతిని రాజధానిగా ప్రకటించి.. ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో అమరావతి కేంద్రంగా ప్రముఖ ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు చేశారు. అమెరికా వెళ్లి అక్కడి వీధుల్లో తిరుగుతూ ప్రపంచంలో పేరుపొందిన ప్రతీ కంపెనీ గడపా తొక్కారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పించారు. అయితే, 2019 తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్ మొత్తం మారిపోయింది.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతాన్ని స్మశానం అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో పలు ప్రముఖ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలు ఏపీని వదిలి వెళ్లిపోయేలా జగన్ సర్కార్ వ్యవహరించింది. మరోవైపు అమరావతి కాదు.. ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రకటించిన జగన్ తన ఐదేళ్ల హయాంలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. కానీ ఆ పేరు చెప్పి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ అభివృద్ధి ఆనవాలు లేకుండా చేశారు. దీంతో జనం జగన్ పాలనను ఛీకొట్టి 2024లో మళ్లీ తెలుగుదేశం కూటమికి పట్టం గట్టారు. వైసీపీని ఛీ కొట్టారు. జగన్ పాలన పట్ల ప్రజలలో ఎంతగా వ్యతిరేకత వ్యక్తం అయ్యిందనడానికి ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడమే తార్కానం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టడంతోనే ఏపీ మళ్లీ పూర్వవైభవం దిశగా పరుగులు పెడుతోంది. ఐదేళ్లు ముళ్ల కంపతో నిండిపోయిన అమరావతి ప్రాంతంలో పనులు జోరందుకున్నాయి. కేంద్రం కూడా ఇతోధికంగా సహకారం అందిస్తుండటంతో రాబోయే కాలంలో అమరావతి రాజధానిని అద్భుతంగా తయారు చేసేలా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే అప్పట్లో ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబుడులు పెట్టేలా అమెరికా వెళ్లి ప్రయత్నాలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఆ బాధ్యతను ఐటీ మంత్రి లోకేశ్ కు అప్పగించారు.
ఆ బాధ్యతను చిత్తశుద్ధితో చేపట్టిన మంత్రి నారా లోకేశ్ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వారంరోజుల పాటు లోకేశ్ అమెరికాలో పర్యటించారు. ఈ క్రమంలోనే అక్కడ జరిగిన ఐటీ సమ్మిట్-2024 లో పాల్గొన్న లోకేశ్.. పలు దిగ్గజ సంస్థల సీఈవోలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఓవరాల్ గా అమెరికా పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అయ్యి ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించడంలో లోకేశ్ వంద శాతం సక్సెస్ అయ్యారు. దీంతోపాటు చంద్రబాబు విజన్ ను కంపెనీల సీఈవోలకు వివరించి వారు ఇప్రస్ అయ్యేలా చేశారు. బ్రాండ్ ఏపీ లక్ష్యంగా సాగిన ఆయన టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. లోకేశ్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. లోకేశ్ పర్యటన విజయవంతం కావడంపై ఏపీ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఐదు సంవత్సరాల అరాచక పాలనలో శిథిలావస్థకు చేరిన ఏపీ పారిశ్రామిక రంగానికి లోకేశ్ ఊపిరిపోశారని అంటున్నాయి. ప్రపంచంలో పేరున్న కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా నాడు చంద్రబాబు అమెరికా వీధుల్లో నడిస్తే.. నేడు లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో కాలినడకన నడుకుంటూ వెళ్లి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీంతో తండ్రికి తగ్గ తనయుడు.. ఏపీ అభివృద్ధే వారి లక్ష్యం అంటూ ఏపీ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో ఏపీ అన్నిరంగాల్లో వెనుకబడి పోయింది. కొత్తగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ మొగ్గుచూపక పోగా.. చంద్రబాబు హయాంలో ఏపీలో ఏర్పాటైన కంపెనీలు వెనక్కు వెళ్లిపోయేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించింది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగంకోసం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో తీవ్రంగా నష్టపోయిన ఏపీని.. మళ్లీ గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. తద్వారా రాబోయేకాలంలో అమరావతి కేంద్రంగా పెద్ద మొత్తంలో ప్రముఖ కంపెనీలు పె్ట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుండగా.. కంపెనీలకు కావాల్సిన వసతి సౌకర్యాలు, ఇతర బెనిఫిట్స్ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొత్తానికి మరికొద్దిరోజుల్లో ఏపీ రూపురేఖలు మారిపోతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.