ఊరంతటిది ఒక దారైతే.. ఉలిపికట్టే దారెటో..?

హిండెన్బర్గ్ ఎక్కడిది?... ఎప్పుడైనా విన్నామా?... అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారు..  జేపీసీ అవసరమే లేదని   అదానీ గ్రూప్ కు అండగా సాక్షాత్తు ఓ సీనియర్ ప్రతిపక్షనేత మాట్లడుతున్నారు.. ఆయనే మరెవరో కాదు.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్! అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్‌..  అదానీ గ్రూప్ పై చేసిన ఆరోపణలతో కూడిన నివేదికపై దర్యాప్తునకు ఒక పార్లమెంటరీ సంయుక్త సంఘం(జేపీసీ) ఏర్పాటు చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండుతో తాను ఏకీభవించలేనని మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. ఒక వైపు విపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యతా యత్నాలు చేస్తుంటే వాటిని గండి కొట్టే విధంగా పవార్ తీరు ఉంది.  అదానీ గ్రూప్ కు అండగా ఆయన నిలబడ్డారు.

తన ప్రసంగంలో ఆయన ఈ  విషయానికి (హిండెన్ బర్గ్ నివేదిక) అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. వీరి గురించి మనం ఎన్నడూ విన్నది లేదు. ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు?  దాని నేపధ్యం ఏమిటి?  దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించిన అంశాలను వారు (ప్రతిపక్షాలు) లేవనెత్తినప్పుడు అందుకు అయిన మూల్యాన్ని దేశ ఆర్థిక వ్యవస్థ భరించింది.

 ఇలాంటి వాటిని మేం ఉపేక్షించేదిలేదు. ఇదంతా (అదానీ గ్రూప్ కు)  లక్ష్యంగా చేసుకున్నట్టు కనపడుతోందనేశారు  సదరు శరద్ పవార్ గారు. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఆయన బీజేపీకి, మోడీకి అండగా మాట్లాడారు. జేపీసీ డిమాండు అంశంపై తనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు.  ఒక పార్లమెంటరీ సంఘాన్ని నియమించాలని విపక్షాలు కోరుతున్నాయి. పార్లమెంటరీ సంఘాన్ని నియమించిన పక్షంలో అది పాలక పక్షం పర్యవేక్షణలోనే పనిచేస్తుంది. పాలక పక్షానికి వ్యతిరేకంగా డిమాండ్ పుట్టుకొచ్చింది.  పార్లమెంటరీ సంఘంలో మెజార్టీ సభ్యులు పాలకపక్షానికి చెందినవారు ఉంటారు. అలాంటప్పుడు వాస్తవం ఎలా వెలుగులోకి వస్తుందని ఆయన అటున్నారు. 'అదానీ- అంబానీ' అంటూ పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకోవడాన్ని తాను అంగీకరించేది లేదని ఆయన తేల్చేశారు.

వటవృక్షంలా పెరిగిన బీజేపీని ఎలా అయినా మట్టికరిపించాలని ప్రతిపక్షాలు ఏకమైయేందుకు తంటాలు పడుతుంటే.. సదరు శరద్ పవార్   ఇలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆతర  ప్రతిపక్ష నేతలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు..  ఊరంతటిది ఒక దారైతే... ఉలిపికట్టె దారెటో అని జనాలు గుసగుసలాడుతున్నారు..!