ఎర్రగడ్డలో సచివాలయం.. చాలా కరెక్ట్...
posted on Jan 28, 2015 10:30AM

తెలంగాణ ప్రజలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారోగానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పైగా కేసీఆర్ లాంటి అద్భుతమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా చాలా గొప్ప ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. అప్పటి నుంచీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అందరూ కలలు కంటున్న బంగారు తెలంగాణ సిద్ధించడానికి ఇంకా ఎంతో సమయం పట్టదన్న నమ్మకం తెలంగాణ ప్రజానీకంలో ఏర్పడింది. సీఎం కేసీఆర్ గతంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలని చేస్తున్న ప్రయత్నం ఒక ఎత్తు. సచివాలయాన్ని ఎర్రగడ్డలో నిర్మించిన వంద అంతస్తుల భవంతిలోకి తరలించడంతోపాటు ఇప్పుడున్న సచివాలయాన్ని కూలగొట్టేసి అక్కడ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలన్న ఆలోచనే నిజంగా ఒక వండర్. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కేసీఆర్ని చూసి కుళ్ళుకోవడానికి ఈ ఒక్క ఐడియా చాలు. అసలు సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలన్న ఐడియా కేసీఆర్ మంత్రివర్గంలో వారికో, అధికారులకో వచ్చి వుండదు. అది స్వయానా కేసీఆర్‌కే వచ్చి వుంటుంది. ఎందుకంటే అంత గొప్ప ఆలోచనలు చేయగల సత్తా ఆయనకే వుంది. మొత్తానికి సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలని నిర్ణయించడం చాలా కరెక్ట్..
ఎర్రగడ్డలో సచివాలయం, మంత్రుల క్వార్టర్స్, అధికారుల క్వార్టర్స్, దాంతోపాటు పెరేడ్ గ్రౌండ్ నిర్మించడం వల్ల అందరూ ఎర్రగడ్డలోనే సెటిలవుతారు. దానివల్ల తెలంగాణ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎలాగంటే, ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు, అధికారుల సమయంలో ఎక్కువ శాతం ట్రావెలింగ్‌కే ఖర్చయిపోతుంది. అందరూ ఎర్రగడ్డలోనే వుండటం వల్ల సమయం కలిసొస్తుంది. ఇంటి నుంచి సచివాలయానికి క్షణాల్లో వెళ్ళిపోవచ్చు. అలా మిగిలిన సమయాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగించవచ్చు. ప్రజా ప్రతినిధులుగానీ, అధికారులు గానీ ప్రజా సేవ చేసీ చేసీ విసిగిపోతే వెంటనే పక్కనే వున్న పరేడ్ గ్రౌండ్‌కి వెళ్ళి వాకింగ్ చేస్తే రిలాక్స్ అవ్వొచ్చు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో వాకింగ్, జాగింగ్ లాంటివి చేయడం వల్ల అందరూ ఆరోగ్యాలను కాపాడుకుని, అలా కాపాడుకున్న ఆరోగ్యాన్ని తెలంగాణ ప్రజల సేవకు వినియోగించవచ్చు. త్వరలోనే బంగారు తెలంగాణ సాధించవచ్చు.