తెలంగాణ సర్కార్ దిగొచ్చింది.. గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
posted on Jan 30, 2023 3:32PM
తెలంగాణ సర్కార్ కు తత్వంబోధపడి బొమ్మ కనిపించింది. రాజ్ భవన్ తో విభేదాల నేపథ్యంలో గవర్నర్ ను విస్మరించి కార్యాలు చక్కబెట్టేయాలన్న ఉద్దేశంతో దూకుడుగా వ్యవహరించిన కేసీఆర్ ప్రభుత్వం.. చివరకు నాలుక కరుచుకుని అడుగు వెనక్కు వేయక తప్పలేదు. గవర్నర్ పై హై కోర్టు కు వెళ్లిన తెలంగాణ సర్కార్ తరువాత పిటిషన్ ను ఉపసంహరించుకుని వెనక్కు తగ్గి పరువుదక్కించుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ పై చేయి సాధించినట్లైంది.
దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల విషయంలో ఉత్కంఠకు తెరపడింది. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతాయని తెలంగాణ సర్కార్ కోర్టుకు తెలియజేసింది. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిస్తారని రాజ్ భవన్ పేర్కొంది. దీంతో ప్రతిష్ఠంభనకు తెరపడింది. గత కొన్నేళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య అగాధం ఏర్పడిన సంగతి తెలిసిందే. గవర్నర్ తనకు ప్రొటోకాల్ ఇవ్వలేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారంటూ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది.
పరస్పర విమర్శల విషయంలో ఇరు పక్షాలూ కూడా తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరించాయి. ఇప్పటి వరకూ గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాల విషయంలో తెలంగాణ సర్కార్ పై చేయి సాధించినట్లు కనిపించినా చివరకు గవర్నర్ దే పై చేయి అయ్యిందని పించేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందుకు బడ్జెట్ సమావేశాలు కారణమయ్యాయి.
సంప్రదాయం ప్రకారం బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉండగా, తెలంగాణ సర్కార్ గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. గత సెషన్ ప్రోరోగ్ కానందున.. దానికి కొనసాగింపుగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయనీ, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండదనీ పేర్కొంది. అందుకు అనుగుణంగానే సమావేశాల షెడ్యూల్ కూడా ప్రకటించేసింది.
అయితే సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలంటే అందుకు గవర్నర్ అనుమతి తప్పని సరైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుమతి కోరుతూ ఈ నెల 21న గవర్నర్ కు బడ్జెట్ ఫైల్ ను పంపింది. అయితే అందుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు.. వరుసగా రెండో సారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్ కు ఎట్లా ఆమోదం తెలపాలని ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ప్రశ్న సంధించారు. తక్షణమే గవర్నర్ ప్రసంగం డ్రాఫ్ట్ పంపాలని కోరారు. అయితే అందుకు ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడంతో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది.
బడ్జెట్ సమావేశాల ప్రారంభ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం అనివార్యంగా హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం లంచ్ మోషన్ పటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది, రాజ్ భవన్ తరఫు న్యాయవాదులు చర్చించుకుని ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా గవర్నర్ పై విమర్శలు వద్దన్న సంగతిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాననీ విన్నవించారు.
అలాగే బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇస్తారని రాజ్ బవన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో ఇరు పక్షాల న్యాయవాదుల అంగీకారంతో కోర్టు విచారణను ముగించింది. దీంతో బడ్జెట్ సమవేశాల విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభనకు తెరపడింది. అయితే బడ్జెట్ సమావేశాల ఫెడ్యూల్ మారే అవకాశాలు మాత్రం ఉన్నాయి.