ఏపీ డీజీపీగా సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్?
posted on Jan 30, 2023 2:21PM
డాక్టర్ సునీల్ కుమార్ ఐపీఎస్. ఏపీలో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నిన్న మొన్నటి వరకూ ఏపీ సీఐడీ చీఫ్ గా బాధ్యతలను నిర్వర్తించిన ఈయన తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆ వివాదాస్పద వైఖరి కారణంగానే సునీల్ కుమార్ ఐపీఎస్ రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని పేరుగా మారింది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, మ్యాన్ హ్యాండలింగ్, ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ నివాసంపై సీఐడీ పోలీసుల దాడి వంటి ఘటనలన్నీ ఈయన హయాంలోనే జరిగాయి. జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం కూడా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్న సమయంలోనే జరిగింది. దాదాపు ఏపీ సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న కాలంలో ఆ దర్యాప్తు సంస్థ డీల్ చేసిన కేసులన్నీ వివాదాస్పదమైనవే.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తే వారిని టార్గెట్ చేసి ఉద్దేశ పూర్వకంగా కేసులు బనాయించేవారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీ సీఐడీ జగన్ సర్కార్ కు అనుకూలంగా పని చేస్తున్నదన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే సునీల్ కుమార్ ను జగన్ సర్కార్ హఠాత్తుగా బదిలీ చేసింది. అలా బదిలీ చేయడానికి రోజుల ముందు ఆయనకు పదోన్నతి కల్పించింది.
దాంతో ఆయనను ఏపీ డీజీపీగా నియమించే అవకాశాలున్నాయని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయనను ఏపీ డీజీపీగా నియమించనున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి సెలవుపై వెళ్లనున్నారని, దీంతో ఆయన స్థానంలో సునీల్ కుమార్ ను నియమించనున్నారని, ఏ క్షణంలోనైనా ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయనీ అంటున్నారు.
సీఐడీ చీఫ్ గా ఉన్న కాలంలో సునీల్ కుమార్ ను ప్రభుత్వం తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుందనీ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. ఆయనను బదలీ చేసిన సమయంలోనే సునీల్ కుమార్ కు మరింత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అప్పట్లోనే రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పుడు ఆ అంచనాలే వాస్తవమని తేలిందని అంటున్నారు.