మెరుగుపడిన తారకరత్న ఆరోగ్యం

తారకరత్నఆరోగ్యం మెరుగుపడింది. ఆయన అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయి. సిటీ స్కాన్ చేశారు. ఆ రిపోర్టులు రావాల్సి ఉంది.  ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్  పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నగుండెపోటుకు గురైన సంగతి విదితమే. ఆయన్ని కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు.

 అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల చికిత్స తరువాత  నందమూరి తారకరత్న ఆరోగ్యం ఒకింత మెరుగుపడింది. ఈ విషయాన్ని నందమూరి రామకృష్ణ మీడియాకు తెలిపారు. తారకరత్న ఎక్మో పై చికిత్స అందిస్తున్నారన్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు.

శరీర అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయనీ, ఆయన త్వరలో పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని రామకృష్ణ చెప్పారు. ఆ తరువాత కొద్ది సేపటికే హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందనీ, అయితే నిలకడగా ఉందనీ ఆ బులిటిన్ లో పేర్కొన్నారు. చికిత్సకు స్పందిస్తున్నారనీ, మరికొన్న పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వివరించారు. ప్రస్తుతం తారకరత్నకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వివరించారు.