చంద్రబాబును దీవించాలని జనాలను కోరిన మంత్రి.. 

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరే ఎక్కువగా వినిపిస్తోంది. కృష్ణ జలాల వివాదంలో వైఎస్సార్  లక్ష్యంగా తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత చంద్రబాబుకు లింక్ పెడుతూ ప్రకటన చేస్తున్నారు. చంద్రబాబు వల్లే రేవంత్ కు పీసీసీ పదవి వచ్చిందని టీఆర్ఎస్, బీజేపీ నేతలు కామెంట్ చేస్తుండగా.. కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి  చంద్రబాబును దీవించాలని జనాన్ని కోరారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లాలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గంగుల పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లతో వృద్ధులు సంతోషంగా ఉన్నారని చెప్పారు గంగుల . ఇంత మంచి పథకాన్ని అందించిన చంద్రబాబుకు దీవెనలు అందించాలా? వద్దా? అని ప్రశ్నించారు. ఆయన కడుపు చల్లగా ఉండాలని కోరుకోవాలా? వద్దా? అని అడిగారు మంత్రి కమలాకర్. అయితే  వెంటనే తాను చేసి తప్పును ఆయన గ్రహించారు. కేసీఆర్ అని చెప్పబోయి చంద్రబాబు అన్నట్టు గుర్తించారు. వెంటనే తన తప్పును సరిదిద్దుకుని ప్రసంగాన్ని కొనసాగించారు.

అయితే గంగుల కమలాకర్ పొరపాటున చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గంగుల కమలాకర్ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచారు.