జగన్మాయతో ఆర్థిక వ్యవస్థ దివాలా? పశ్చాతాపంలో పీకే.. మోసపోయామంటున్న జనం.. 

జీతాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకున్న భరోసా ప్రైవేటు ఉద్యోగులకు ఉండదు.ముఖ్యంగా సకాలంలో జీతాలు వస్తాయనే భరోసా ప్రైవేటు ఉద్యోగులకు ఉండదు. అయితే ఇప్పుడు, ఏపీలో, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ భరోసా లేకుండా పోయింది. చివరకు పెన్షనర్ల పెన్షన్’ కూడా దైవాధీనం, పెన్షనర్ల ప్రాప్తం అన్నట్లుగా మారిపోయిందని, ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. అవును గతంలోనూ ఒకటి రెండు సందర్భాలలో జీతాలు లేటయ్యాయి,కానీ, ఇలా ఏ నెలకానెల జీతాలు వస్తాయో రావో అనే ఆందోళన గతంలో ఎప్పుడూ లేదని ఉద్యోగులు అంటున్నారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాల పేరిట ఖజానా మొత్తాన్ని ఎప్పటికప్పుడు తుడిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాగే అందిన కాడికి అప్పుతెచ్చి కూడా పందేరాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏది ఏమైనా, అప్పులే కాదు, ఇంకేదైనా, (బెగ్, బారో ఓర స్టీల్) చేసైనా, సంక్షేమ పథకాలు అమలు చేయాలని,తద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారనేది, అందరికీ తెలిసిన విషయమే. అలాగే, రాష్ట్ర విభజనతో ఆదాయం పడిపోయి లోటులో కూరుకుపోయిన రాష్ట్ర  ఆర్థిక వ్యవస్థ, జగన్ రెడ్డి రెండేళ్ళ పందారాలతో పూర్తిగా ఊబిలో కూరుకుపోయింది. 

అందుకే ఏపీలో ఉద్యోగుల జీతాలకు నెలనెలా దిక్కులు చూడవలసిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ఒక‌టో తేదీక‌ల్లా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలలో జమ కావలసిన జీతాలు.. వారం  పది రోజులకు కూడా  జమ  కావడం లేదు. ఖ‌జానాలో డ‌బ్బు వెస‌లుబాటు అనుగుణంగా విడ‌త‌ల వారీగా ప్ర‌భుత్వం ఉద్యోగులకు వేత‌నాలు చెల్లిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌కు జూలై ఒకటవ తేదీన జమ కావలసిన జూన్ నెల జీతాలు జులై ఎనిదవ తేదీన జమయ్యాయి. ఒక్కఉపాధ్యాయులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల అందరిదీ కూడా ఇదే దయనీయ పరిస్థితి. 

ఈ విధంగా ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి చేరుకుంటే,అభివృద్ధి అనేది పూర్తిగా అడుగంటి పోతుంది. నిజానికి ఇప్పటికే పోలవరం వంటి ప్రాజెక్టులు నత్త నడకన నడుస్తున్నాయి. చాలా వరకు అభివృద్ది కార్యక్రమాలు స్తంభించి పోయాయి. కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బకాయిలు కొండలా పెరిగిపోయాయని అధికారులే ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుంటే, రాష్ట్రానికి  పెట్టుబడులు రావు సరికదా, ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్లి పోతాయి. జీతాలు సకాలంలో రాకపొతే, ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటే పరిపాలన కుంటుపడుతుంది.పడకేస్తుంది. ఇదొక విషచక్రం. రాష్ట్రం ఈ విషయ చక్రంలో చిక్కుకుంటే, ఇక రాష్ట్రాన్ని రక్షించడం ఎవరి తరం కాదు. 

నిజానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆందోళన కరంగా ఉందని, రాష్ట్రం దివాలా అంచులలో ఉందని ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. అయినా జగన్ రెడ్డి పరభుత్వం పట్టించుకోలేదు. అందుకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది. ఇక ముందు పరిస్థితి మరింత అధ్వాన్న స్థితికి  చేరుకుంటుంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకున్నందుకు  ప్రజలు చెల్లిస్తున్న మూల్యం ఇది. అందుకే, 2019 ఎన్నికల్లో జగన్ రెడ్డిని గెలిపించిన ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత కిషోర్ కూడా జగన్ రెడ్డిని గెలిపించి తప్పు చేశానని పశ్చాతాపం వ్యక్త పరిచారు.ప్రజలకు కూడ అదే అనుభవం త్వరలో వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.