పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో రివ్యూ.. పాలకొల్లు అధికారులకు నిమ్మల క్లాస్ 

ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ పాలన సాగుతుందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఒకలా ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వంలో మరోలా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు కూడా చాలా వరకు రివర్స్ అయ్యాయి. పాలకుల తీరులానే అధికారులు కూడా అంతా రివర్సుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అలాంటి ఘటనే జరిగింది. 

ఎక్కడైనా ప్రజా ప్రతినిధి వస్తున్నారంటే అధికారులు హడావుడి చేస్తారు. కానీ పాలకొల్లులో మాత్రం సీన్ రివర్స్. ప్రభుత్వ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే వస్తుంటే.. అధికారులు మాత్రం  పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయడు ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ ఎమ్మెల్యే ఉండటంతో అధికారులు ఆయనకంటే వైసీపీ నేతల డైరెక్షన్ లోనే పని చేస్తున్నారని చెబుతున్నారు. గత రెండేళ్లుగా పాలకొల్లు మున్సిపల్ పరిధిలో పేరుకుపోయిన సమస్యలను మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌కు విన్నవించేందుకు కార్యాలయానికి వచ్చారు రామానాయడు. అయితే ఆఫీసులో మున్సిపల్ కమీషనర్, ఇంజనీరింగ్ అధికారులు ఎవరు కనిపించలేదు. 

అధికారుల ఎక్కడని ఎమ్మెల్యే రామానాయుడు ఆరా తీయగా... స్థానిక ఎయంసీ కార్యాలయం వద్ధ పక్క  నియోజకవర్గమైన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన మున్సిపల్ రివ్యూలో పాల్గొన్నట్లు తెలింది. దీంతో ఎమ్మెల్యే రామానాయుడుకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే రావల్సిందిగా అధికారులకు సమాచారం పంపించారు.

కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చేంత వరకూ వేచి చూశారు ఎమ్మెల్యే నిమ్మల. వారు ఆఫీసుకి వచ్చాక తీవ్రస్థాయిలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న స్థానిక ఎమ్మెల్యేను కాదని, పొరుగు నియోజకవర్గ శాసనసభ్యునితో రివ్యూ పెట్టుకోవడమేంటని నిలదీశారు. ప్రజల కష్టార్జితంతో పన్నులు కట్టిన నిధులను స్వప్రయోజనాలకు వినియోగించవద్దంటూ అధికారులను హెచ్చరించారు. నెల రోజుల గడువులో త్రాగునీరు, ఇళ్ల స్వాధీనం, రోడ్డు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు, అంబేద్కర్ భవన్, స్మశానవాటిక, హెల్త్ పార్క్, ఎన్టీఆర్ కళాక్షేత్రం, రామగుండం పార్క్ వంటి పనులు పూర్తి చేయకపోతే ప్రజలతో, మహిళలతో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుుడు హెచ్చరించారు. 
 
పాలకొల్లు మున్సిపల్ అధికారుల తీరు హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎమ్మెల్యేను పట్టించుకోకుండా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో సమావేశం కావడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న విలువ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఉండదా అని చర్చించుకుంటున్నారు.