తొమ్మిదేళ్లకే దశాబ్ది ఉత్సవాలా? 

2 జూన్ 2014 తెలంగాణలో చారిత్రాత్మక రోజు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి  కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది.

తెలంగాణ ఆవిర్భావం జరిగి నేటికి 9 ఏళ్లు పూర్తవుతుంది. ఇది పచ్చి నిజం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆవిర్బావోత్సవాలను దశాబ్ది ఉత్సవాలు అని ప్రచారం చేసుకుంటుంది. 9 ఏళ్లు పూర్తి అయి పదో వసంతంలోకి అడుగుపెట్టినంత మాత్రాన దశాబ్ది ఉత్సవాలు ఎలా అవుతాయని తెలంగాణా వాదులు ప్రశ్నిస్తున్నారు. బిఆర్ఎస్ అధికారంలో వచ్చి తొమ్మిదేళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పదేళ్లు అని ప్రచారం చేసుకుంటుంది. బిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలకు పోటీగా కాంగ్రెస్ పార్టీ, బిజెపీలు కూడా దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అమెరికాలో కూడా దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. బిజెపి కూడా తానేం తక్కువ కాదు అని గోల్కొండలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ తెలంగాణాను తెచ్చింది మేమే అని ప్రచారం చేసుకుంటున్నాయి. తెలంగాణ ఇచ్చింది తామేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. తెలంగాణ తెచ్చింది తామేనని చెప్పుకునే బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలు అని నామకరణం చేసి అన్ని పార్టీలను మిస్ గైడ్ చేసింది.

తెలంగాణలో మక్కీ మక్కీ అనే నానుడిని బిఆర్ఎస్ యేతర పార్టీలు సార్థకం చేసాయి. అందరికంటే తెలివైన విద్యార్థి అనుకుని మిగతా విద్యార్థులు పరీక్షాకేంద్రంలో కాపీ కొట్టిన చందంలా తయారైంది రాజకీయ పార్టీల పరిస్థితి.