ఇక తెలంగాణలో ప్రియాంకం?

హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ  ఈ సంవత్సరం చివర్లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చూపి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా  తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేద్రీకరించిన కాంగ్రెస్  ప్రచార బాధ్యతలు పార్టీ  ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాకు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రియాంక రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీచేస్తారని పార్టీలో చర్చ జరుగుతున్నట్లు  తెలుస్తోంది. 

నిజానికి ప్రియాంకా వాద్రా  చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ఒక దశలో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి మధ్య మాటల యుద్ధం గీతలు దాటి, పతాక స్థాయికి చేరిన సమయంలో ప్రియాంక జోక్యంతోనే ఆ వివాదం సర్దు మణిగిందని అంటారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో  కోమటి రెడ్డి వెంకట రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్  చేసిన  వ్యాఖ్యలు, ఆపై అటు నుంచి ఇటు నుంచి అటు పేలిన తూటాల నేపధ్యంలో తమ్ముడు రాజగోపాల రెడ్డి బాటలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.. బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిపారు. 

అయితే, ఆ సమయంలో ప్రియాంక జోక్యం చేసుకుని కోమటి రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతనే ఆయన మెత్తబడి, ఎన్నికల సమయంలో వివాదాలకు దూరంగా ఉండేందుకు విదేశాలకు వెళ్ళారని అంటారు. అయితే అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే  కోమటి రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రియాంకతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాతనే తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండించారు. అందుకే కావచ్చు కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీలో కొనసాగడానికి ప్రియాంక చూపిన చొరవే కారణమని అంటారు. అలాగే రేవంత్ రెడ్డికి అనుకూలం అనే ముద్ర పడిన  మాణిక్యం ఠాగూర్‌ ను పార్టీ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించి, మాణిక్‌రావ్‌ ఠాక్రేకు బాధ్యతలు అప్పగించడం వెనక ప్రియాంక పాత్ర కీలకమని అంటారు.

అదలా ఉంటే ప్రియాంక వాద్రాకు ఎన్నికల బరిలో దిగి, పార్లమెంట్ లో పాదం మోపాలనే కోరిక చాలా బలంగా వుంది. అందులో సందేహం లేదు. 2019 ఎన్నికల్లోనే ఆమె యూపీలో వారాణాసి నుంచి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు సై అన్నారు. అయితే, ఎందుకనో ఏమో కానీ రాహుల్ గాంధీ అడ్డుపుల్ల వేశారు. ఆ తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రియాంక ప్రచార బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  చిత్తుగా ఓడిపోయినా నేపధ్యంలో ప్రియాంక యూపీ మీద ఆశలు వదులుకున్నారనీ, అప్పటి నుంచే ఆమె పార్లమెంట్ ఎంట్రీకి తెలంగాణను వేదికగా ఎంచుకున్నారని  అంటారు.

అందుకే స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా  ఉభయ తారకంగా ప్రియాంక తెలంగాణ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇందిరా గాంధీ పోటీ చేసిన మెదక్ లేదా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నల్గొండ జిల్లా నుంచి లోక్ సభకు ప్రియాంక పోటీ చేస్తారని అంటున్నారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఈసారి తాను నల్గొండ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రటించిన నేపధ్యంలో  ప్రియాంక  ప్రస్తుతం కోమటి రెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న భువనగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయచ్చని అంటున్నారు. 

అందుకే కొద్ది రోజుల క్రితమే రాష్ట్రానికి  వచ్చిన ప్రియాంక. మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారని తెలుస్తోంది. మే నెల 9వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని నేరుగా  హైదరాబాద్‌లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో ఆమె పాల్గొన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కాగా ఇప్పుడు  ప్రియాంక  మరోసారి రాష్ట్ర పర్యటనకు వచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. జూన్ చివరి వారం లేదా జులై మొదటివారంలో ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చేందుకు షెడ్యూల్ ఖారు అయిందని అంటున్నారు.

మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది.ఈ సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారని సమాచారం. ఈ సభలో పాల్గొనేందుకు ప్రియాంకగాంధీ రానున్నారని తెలుస్తోంది. సో.. తెలంగాణలో కాంగ్రెస్ లో ఇక ప్రియాంక  ముద్ర కనిపిచడం  ఖాయమని అంటున్నారు. ప్రియాంకం మొదలు కానుందని అంటున్నారు.