స్టీల్ ప్లాంట్ పై జగన్ సర్కార్ మోసం! పవన్ పోరాడాలన్న గంటా 

విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వం, కొంత మంది బిజేపి నేతలు ప్రజలను తప్పుతోవ పట్టించారని విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అన్నారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ పై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడంతో.. జగన్ సర్కార్ బండారం బయటపడిందన్నారు. స్టీల్ ఫ్లాంట్ ఇప్పుడు కాపాడుకోలేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామన్నారు గంటా. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ పై చంద్రబాబు కూడా ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. 

స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ వంద శాతం అయిపోయిందని.. అది ముగిసిన అధ్యాయం అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అధికారంలో ఉన్నవారికి ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి.. ఇప్పుటికైనా ముఖ్యమంత్రి ప్రధాన పాత్ర తీసుకోవాలన్నారు. స్టీల్ ఫ్లాంట్ కాపాడుకోవడం కోసం రాజకీయాలు,పార్టీలు పక్కన పెడదామన్నారు గంటా శ్రీనివాస రావు. పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటికరణ పై స్పందించాలన్నారు. ఫ్లాంట్ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ ముందుకు రావాలని సూచించారు.    

బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా  తన రాజీనామాను అమోదింపచేసుకుంటానని చెప్పారు గంటా శ్రీనివాసరావు. వైసిపీ నేతలు రాజీనామాలు చివరి అస్త్రం అన్నారని... ఇప్పుడైనా చివరి అస్త్రం వాడాలన్నారు. అధికార పార్టీ ఒక ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్ళాలని.. వారితో  తోడుగా పోరాటం చేయడానికి  తాము  సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటి  స్టీల్ ఫ్లాంట్ ఎక్కడికి వెళ్ళదని బిజేపి నేతలు మాయమాటలు చెబుతున్నారన్నారు గంటా. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. మైండ్ గేమ్ ఆడడానికి ఇది సరైన సమయం కాదని స్పష్టం చేశారు గంటా శ్రీనివాస రావు.