‘కర్మఫలం’ తప్పని విజయకుమార్‌రెడ్డి!

జగన్ రాక్షసరాజ్యంతో అంటకాగి, ఇష్టారాజ్యంగా పరిపాలన చేసిన ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయకుమార్‌రెడ్డికి అసలైన కష్టాలు మొదలయ్యాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చేసిన తప్పులకు సమాధానం చెప్పకుండా, తన బాధ్యతలు ఇతరులెవరికీ అప్పగించకుండా, సమాచార శాఖను గాలికి వదిలేసి ఢిల్లీకి పారిపోయిన విజయకుమార్ రెడ్డికి అక్కడ ఎదురుగాలి వీచింది. తన డిప్యూటేషన్ పూర్తయిందని, తనను వెంటనే కేంద్ర సర్వీసులోకి తీసుకోవాలని విజయకుమార్‌రెడ్డి పెట్టుకున్న అప్లికేషన్‌ని కేంద్ర ప్రభుత్వం  తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వ రిలీవ్ ఆర్డర్ వుంటేనే మళ్ళీ కేంద్ర సర్వీసులోకి తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో ఏపీ నుంచి చెప్పాపెట్టకుండా పరారైన విజయకుమార్‌రెడ్డి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో వున్నారు. తన త‌న డిప్యుటేష‌న్ జూన్‌9తో అయిపోయింది క‌నుక తాను రిలీవ్ అయిన‌ట్లే అని ఆయ‌న వాదిస్తున్నారు. తన డిప్యుటేషన్ పొడిగింపును తాను రద్దు చేసుకున్నానని, తనకు డిప్యుటేషన్ వద్దని జీఏడీని కోరానని, అయితే దానిని ఆమోదించాల్సిన ప్రభుత్వం ఆమోదించలేదు కాబట్టి, తన డిప్యుటేషన్ ముగిసినట్టేనని ఆయన అంటున్నారు. దీనిపై ఆయ‌న క్యాట్‌ను ఆశ్రయిస్తారన్న ప్రచారం జరుగుతోంది.  కానీ, ఆయన ఈ విషయంలో క్యాట్‌కి వెళ్ళినా ఉపయోగం వుండదని పరిశీలకులు అంటున్నారు. 

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తుందన్న ఉద్దేశంతో ఆయన రెండేళ్ళ డిప్యుటేషన్ కోరారు. దానిని కేంద్రం ఆమోదించింది. అందువల్ల ఆయన ఏపీ ప్రభుత్వ సర్వీసులో ఉన్నట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ విషయకుమార్ రెడ్డికి తెలుసు. కానీ తెలియనట్టు అమాయకత్వం నటిస్తున్నారు. బుధవారం నాడు ఆయన స‌చివాల‌యానికి వ‌చ్చి జిఏడి అధికారుల‌ను క‌లిశారు. తనను రిలీవ్ చేయించుకునేందుకే ఆయ‌న అక్కడకి వెళ్ళారని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే, ఢిల్లీ వెళ్ళిపోవాలన్న ఆత్రుతతో ఆయన ఐ అండ్ పీఆర్‌ని అనాథలా వదిలేశారని, బాధ్యతలను ఎవరికీ అప్పగించకుండా పరారవడం దారుణమని, గతంలో ఇలా ఎవరూ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఏ ప్రభుత్వలో అయినా ఐ అండ్ పీఆర్ శాఖ కీలకంగా వుంటుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వుంటుంది. మంత్రి ఉన్నప్పటికీ, కమిషనర్ లేకపోవడంతో ఈ శాఖలో పనిచేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇంకా రాలేదు. కమిషనర్ వుంటేనే వారి జీతాలు విడుదలవుతాయి. ఈ శాఖకు కమిషనర్ ఉన్నట్టా.. లేనట్టా అర్థం కావడం లేదు. ఏది ఏమైనా, విజయకుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించక తప్పదని, గతంలో జగన్‌తో అంటకాగిన పాపాన్ని మోయక తప్పదనే బాధలో విజయకుమార్ సన్నిహితులు వున్నారు.