తెలుగుదేశం కార్యాలయంపై దాడి.. అప్పిరెడ్డి, అవినాష్ , నందిగం సురేష్ అరెస్ట్‌ కు రంగం సిద్ధం

అధికారమదంతో ఇష్టారీతిగా చెలరేగిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడు ఫలితం అనుభవించే టైం వచ్చింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల కిందట జరిగిన  దాడి ఘటనకు సంబంధించి దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ ల అరెస్టుకు రంగం సిద్ధమైంది. వీరి నేతృత్వంలోనే దాడి జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలూ సేకరించారు. లేళ్ల అప్పిరడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ లు వారి వారి ముఖ్య అనుచరులను రాళ్లు, కర్రలతో నేరుగా తెలుగుదేశం ఆఫీసుపైకి పంపినట్లు పోలీసులు సీపీ ఫుటేజీ ఆధారంగా నిర్ధారించారు. దాడి జరిగిన రోజజున గుంటూరు, విజయవాడ, మంగళగిరి నుంచి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వైపు కర్రలు, రాడ్లు, రాళ్లతో వచ్చిన వారిని గుర్తించారు. అలాగే వారు వచ్చిన వాహనాల వివరాలను టోల్ గేట్ రికార్డుల ద్వారా సేకరించిన పోలీసులు అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. అలాగే కాల్ డేటా ద్వారా  దాడికి పాల్పడిన వారు ఎవరెవరి ఆదేశాల మేరకు ఆ పని చేశారో కూడా నిర్ధారించుకున్నారు. 

 పక్కా వ్యూహం ప్రకారం ఈ దాడి జరిగిందని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిథి పట్టాభి నివాసంపైనా, తెలుగుదేశం  కేంద్ర కార్యాలయంపైనా ఏకకాలంగా దాడి జరిగేలా  దేవినేని అవినాష్ తన అనుచరులను ప్రేరేపించారనీ కూడా పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు.  అలాగే గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి తన అనుచరులను పంపారని తాడేపల్లిలోని  వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. అలాగే నందిగం సురేష్ అనుచరులు కూడా దాడిలో పాల్గొనడమే కాకుండా, తెలుగుదేశం కార్యాలయంపై దాడి, విధ్వంసం వీడియోలను అక్కడి నుంచే వారు నందిగం సురేష్ కు షేర్ చేశారని పోలీసులు కనుగొన్నారు.  

ఇక అప్పిరెడ్డి, అవినాష్, నందిగం సురేష్ ల అరెస్టు మాత్రమే కాకుండా వారిని వెనకుండి ప్రేరేపించినదెవరో కూడా తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురికీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడి వెనుక  సజ్జల ఉన్నారన్న అనుమానం పోలీు వర్గాలలో వ్యక్తం అవుతోంది.