విశాఖ ఓటర్లు ఎటువైపు? కలవరమాయె వైసీపీ మదిలో..

మరికొద్ది గంటల్లో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు. అధికార, ప్రతిపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో వైజాగ్ ఓటర్లు కాక మీదున్నారు. ఇంతటి కీలక సమయంలో అధికార పార్టీకి మరో పిడుగు పాటు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తథ్యం అంటూ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రకటించడంతో పరిణామాలు అమాంతం మారిపోతున్నాయి. అవసరమైనప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామంటూ మంత్రి చెప్పడంతో అధికార పార్టీ అడ్డంగా బుక్కైంది. ఇన్నాళ్లూ విశాఖ ఉక్కు కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నట్టు తేలిపోయింది. తమకేమీ తెలీదంటూ సర్కారు తప్పించుకోవడం ఇకపై కుదరదు. రాష్ట్రంతో ఎప్పటికప్పుడు సందప్రదిస్తున్నామంటూ స్వయంగా కేంద్రమంత్రి పార్లమెంట్ లో స్టేట్ మెంట్ ఇవ్వడంతో వైసీపీ పరిస్థితి అడకత్తరలో పోకవక్కలా మారింది. విశాఖ కార్పొరేషన్ ఎలక్షన్ కు ఒక రోజు ముందు వచ్చిన ఈ ప్రకటన వైసీపీని పీకల్లోతు ఊబిలోకి దింపేసింది. 

నెల రోజులుగా విశాఖ ఉక్కు కోసం కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. నిరవధిక నిరాహార దీక్షలు, ధర్నాలు, రాష్ట్ర బంద్ తో హోరెత్తిస్తున్నారు. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్నా.. కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వంద శాతం ప్రైవేటీకరణ తప్పదంటూ తేల్చి చెప్పేసింది. కేంద్రాన్ని ఒప్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజలను మభ్య పెట్టేందుకే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని అంటున్నారు. విశాఖ ఉక్కును అడ్డంగా అమ్మేసుకోడానికి కేంద్రానికి జగన్ ప్రభుత్వం సహకరిస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో తేలిపోయింది. 

కేంద్రం ప్రకటనతో విశాఖ మరోసారి భగ్గుమంది. ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసాయి. అర్థరాత్రి జాతీయ రహదారిని జామ్ చేశారు కార్మికులు. మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధించారు. విశాఖ ఉక్కు కోసం ఉద్యమ కార్యచరణ సైతం సిద్ధం చేశారు. ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కసితో రగిలిపోతున్నారు. ఆ ఆగ్రహం బుధవారం జరిగే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలపై సుస్పష్టంగా కనిపించబోతోంది. ఆంధ్రుల హక్కును కాలరాస్తూ.. అడ్డగోలుగా అమ్ముకుంటూ.. ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న కేంద్రం తీరును నిరసిస్తున్నారు. ఆ కేంద్రానికి ఇతోధికంగా సహకరిస్తూ.. ప్రైవేటీకరణకు పరోక్షంగా పావులు కదుపుతూ.. ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు విశాఖ ప్రజలు. 

ప్రజాగ్రహం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు రూపంలో వెల్లడికానుందని తెలుస్తోంది. జీవీఎమ్సీలో అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఆంధ్రుల హక్కు కోసం పిడికిలి బిగించి పోరాడుతున్న టీడీపీకి మద్దతుగా విశాఖ ఓటర్లు నిలిచే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత కీలకం. ప్రజానాడి ఎలా ఉందో.. ఎవరికి అనుకూలంగా ఉందో.. ఈ ఎలక్షన్ తో తేలిపోనుంది. జీవీఎమ్సీ ఎలక్షన్లు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు రెఫరెండంగా భావిస్తున్నారు ఓటర్లు. ఓటుతో తమ తీర్పు చెప్పేందుకు సై అంటున్నారు. అందుకే.. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన తర్వాత వైసీపీలో చెప్పలేనంత కంగారు, కలవరం...