ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థిగా బీసీకి చాన్స్

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు  కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ స్థితిలో  ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. పెద్దారెడ్ల సామ్రాజ్యంగా ఉండే నెల్లూరులో ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయా అంటూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సాధారణంగా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతుంది.

అయితే ఈ సారి పార్టీల అధినాయకులు బీసీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా  ఉదయగిరి  అసెంబ్లీ నియోజకవర్గ   అభ్యర్థుల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్‌ జగన్‌   నాయకత్వంలోని వైసీపీ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి   పోటీ   దాదాపుగా ఖరారైంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థి కోసం అన్వేషణలో భాగంగా బీసీ అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి బహిష్కృతుడై తెలుగుదేశం గూటికి చేరిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి పోటీకి దూరంగా ఉంటానన్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీసీ వర్గానికి చెందిన బీద రవీంద్ర పేరు ప్రస్తావించినప్పటికీ, ఆయన కూడా పోటీలో నిలవడానికి సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. దీంతో తెలుగుదేశం నుంచి ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ఇద్దరు బీసీ నేతలు రేసులో నిలిచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో ఒకరైన చంచల్ బాబు యాదవ్ అయితే వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి దీటైన అభ్యర్థిగా నిలవగలుగుతారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

అదే సమయంలో ఈ సీటులో పోటీ కోసం రేసులో నిలిచిన రెండో వ్యక్తి డాక్టర్ మల్లికార్జున రావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  ప్రభుత్వ వైద్యుడిగా పని చేసి రిటైర్ అయిన డాక్టర్ మల్లికార్జున రావు రిటైర్మెంట్ తరువాత నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ వైద్యశాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. అన్నిటికీ మించి యాదవ సామాజిక వర్గంలో ఆయనకు మంచి పేరు ఉంది.  ఒక్క ఉదయగిరి అనే కాకుండా మరో రెండు నియోజకవర్గాలలో కూడా బీసీ అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న యోచనతో తెలుగుదేశం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మొత్తం మీద రానున్న ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లలో బీసీ కార్డ్ ద్వారా సత్ఫలితాలు పొందాలని తెలుగుదేశం యోచిస్తుంటే.. జగన్ పార్టీ కూడా జిల్లాలో బీసీలకు పెద్ద పీట వేసే యోచనలో ఉందని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ అయ్యిందంటున్నారు.