ఆ సిట్టింగులకు నో టికెట్స్.. ఇప్పటికే జగన్ నిర్ణయం?

ఏపీలో వైసీపీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా పడిపోతోంది. ఇందుకు సర్వేలను, నివేదికలను ఉటంకించాల్సిన అవసరం లేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే సరిపోతుంది.  ఆ విషయం విపక్షానికే కాదు.. అధికార వైసీపీకీ మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కూ కూడా స్పష్టంగానే అర్ధమైంది. ఈ క్రమంలోనే  సీఎం జగన్ రెడ్డి తమ పార్టీ నేతలు, జిల్లాలు, ప్రాంతీయ ఇన్ చార్జిలతో  వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సమీక్షలు చేస్తున్నారు.

వీటన్నిటిలోనూ ఆయన వైనాట్ 175 అంటూ చెబుతుండటం మేకపోతు గాంభీర్యం తప్ప మరోటి కాదని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఆ భేటీల్లో తాను స్వయంగా చేయించిన సర్వేల్లో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన రిపోర్టులపై జగన్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా  పార్టీ మరోసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని, అందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై జగన్ లో  అసహనం ఓ రేంజ్ లో పెరిగిపోతోందని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.  ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు సరిగా లేకపోవడం వల్లే పార్టీకి గడ్డు  పరిస్థితి వచ్చిందని జగన్ అంటున్నారు.  ఈ క్రమంలోనే జగన్ తన పార్టీలోని సిట్టింగులలో చాలా మందికి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చేది లేదని చెప్పకనే చెప్పేస్తున్నారు.  

ఇలా సిట్టింగులకు ఉద్వాసన చెప్పే నియోజకవర్గాలలో దాదాపు 30 నియోజకవర్గాలపై ఇప్పటికే ఆయనో నిర్ణయం తీసేసుకున్నారని కూడా అంటున్నారు. అలా పక్కన పెట్టాలనుకునే వారిలో పలువురు సీనియర్లు, ఒకరిద్దరు మంత్రులు, మాజీ మంత్రులూ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరో వైపు జగన్ కూడా ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఎమ్మెల్యేలూ మీరు మారాలి, మీ పని తీరు మెరుగుపడాలి.. లేకుంటే టికెట్ కష్టమే.. ఇందులో ఎలాంటి మోహమాటం లేదు అని చెబుతూ వస్తున్నారు.  ఇప్పటికే చెప్పినా పని తీరు మార్చుకోని, మెరుగుపరుచుకోని ఓ 30 మందికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి కూడా వచ్చేశారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  ప్రస్తుతం అభ్యర్థి మార్పు తథ్యమని వినిపిస్తున్న నియోజకవర్గాల విషయానికి వస్తే.. ఉమ్మడి నెల్లూరు జిల్లా జిల్లా గూడూరు, వెంకటగిరి, నెల్లూరు రూరల్ ఉదయగిరి, అలాగే ఉమ్మడి కడప జిల్లా రాజంపేట, హిందూపురం, ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కైకలూరు, నందిగామ, తిరువూరు అలాగే కర్నూలు జిల్లా పాణ్యం, నందికొట్కూరు ఇంకా  తిరుపతి,  కనిగిరి, గిద్దలూరు శ్రీకాళహస్తి ,పలమనేరు ననియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను తెరమీదకు తీసుకురావడం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

ఇంకా   శ్రీకాకుళం జిల్లాలోనూ   మార్పులు ఉంటాయంటున్నారు. అదే విధంగా విజయనగరం, బొబ్బిలి, భీమిలి నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమలోని ఏలూరు, ఆచంట, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాలలోనూ కొత్త అభ్యర్థులను రంగంలోకి దించేందుకు జగన్ ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని చెబుతున్నారు.  అయితే వీరే కాక ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ టికెట్లు దక్కని సిట్టింగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రజలలో ఉండి, వారి సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను ఉపేక్షించేది లేదని జగన్ చెబుతున్న మాటలు కేవలం హెచ్చరికలు కావనీ, కొత్త ముఖాలతో వచ్చే ఎన్నికలకు వెళితేనే.. ఇప్పుడు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకత తీవ్రత ఒకింతైనా తగ్గే అవకాశం ఉందన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలనూ, ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలనూ ఎమ్మెల్యేల వైఫల్యంగా ప్రజలకు చూపి సేఫ్ గేమ్ అడాలన్న ఉద్దేశంతో జగన్ అడుగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే సిట్టింగులకు టికెట్లు దక్కని పరిస్థితిపై పార్టీలో అసమ్మతి రాజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమకు టికెట్ వచ్చే అవకాశం లేదంటూ జగన్ ఇస్తున్న సంకేతాలపై ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తిరుగుబావుటా ఎగురవేసేందుకు రెడీ అవుతున్నారు. రానున్న రోజులలో వైసీపీలో అసమ్మతి మరింత జ్వలించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.