న్యూట్రల్ ఓటును కూడా కూటమికి దఖలు పరిచేసిన జగన్

నిజానిజాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచారాలు కోటలు దాటేస్తాయి. పార్టీలు, నేతలు చెప్పేది ఏది నిజం, ఏది అబద్ధం అన్నది వేరే విషయం. ఎవరి మాటలను జనం విశ్వసిస్తున్నారు. ఎవరి మాటలను నమ్మడం లేదు అన్నది జనం ఓటుతో చెప్పే వరకూ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.  

అయితే  సర్వేలు మాత్రం ప్రజానాడిని పట్టి చూపుతాయి. అందుకే సర్వేల పట్ల అందరిలోనూ సహజంగా ఆసక్తి ఉంటుంది.  అయితే సర్వేలు కూడా నూరు శాతం నిజం అయ్యే అవకాశాలు లేవని ఎన్నికల వ్యూహకర్త, సర్వేలకు పెట్టింది పేరు అయిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే పలు సందర్భాలలో చెప్పారు.    ఎన్నికల వేళ ప్రజల నాడి మారిపోవడానికి ఒక  బలమైన సంఘటన చాలు అని ఆయన గతంలో చెప్పారు.  ఔను నిజమే  రాజకీయాలు ఎప్పుడు చలన రహితంగా, నిశ్చలంగా ఉండవు. అన్నిటికీ మించి రాజకీయ పార్టీల మద్దతు దారులు, కార్యకర్తలు పార్టీల సభ్యులు వారు వారు ప్రాతినిథ్యం వహించే పార్టీలవైపే ఉంటారు అదులో సందేహం లేదు. అయితే ఎన్నికలలో జయాపజయాలను నిర్ణయించేది మాత్రం తటస్థ ఓటర్లు. ఔను న్యూట్రల్ ఓటర్లు ఎటుమొగ్గితే విజయం అటువైపు ఉంటుందన్నది రాజకీయపండితులు చెప్పే మాట. 

అయితే ఇప్పుడు వారే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఉందంటున్నారు. ఏపీలో కాగడా పెట్టి వెతికినా తటస్థులు కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల జగన్ అస్తవ్యస్త, అరాచక పాలన కారణంగా తటస్థ ఓటరనే వాళ్లు లేకుండా అందరూ జగన్ వ్యతిరేక శిబిరానికి అంటే తెలుగుదేశం కూటమికి జై కొట్టేశారని చెబుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో వెలువడిన ప్రతి సర్వే కూటమి ఘనవిజయాన్నే సూచిస్తోందంటున్నారు.  ఇక  కొద్దో గొప్పో తటస్థ ఓటర్లు ఉన్నా జగన్ వారిని కూడా తెలుగుదేశం కూటమికి చేరువ చేసేశారని తాజాగా ఆయన తన సొంత చెల్లి చీరపై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ చెబుతున్నారు.

పోలింగ్ కు రోజుల ముందు ఆయన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కట్టుకున్న చీర రంగుపై చేసిన వ్యాఖ్యలు తటస్థులను జగన్ కు వ్యతిరేకంగా మార్చేశాయని అంటున్నారు.   అంటే జగన్ తన అనుచిత వ్యాఖ్యలతో, అస్తవ్యస్త పాలనతో తటస్థ ఓటర్లను కూడా కూటమికే జై కొట్టేలా మార్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.