జగన్ పంతమా.. మేకపాటి పట్టుదలా..?
posted on Apr 27, 2022 5:33PM
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ అధినేత నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో గురువారం భేటీ అవుతున్నారు. ఇటీవలే హఠాత్తుగా మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా ప్రకటించాలని రాజమోహన్ రెడ్డి కోరేందుకు జగన్ ను కలుసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్- మేకపాటి రాజమోహన్ రెడ్డి భేటీతో ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణకు ముందు ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మేకపాటి కుటుంబానికే చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కూడా సీఎం జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. ఆత్మకూరు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎవరనే విషయం కూడా ఇంతవరకు తేల్చలేదు.
ఇలా ఉండగా.. ఆత్మకూరు ఉప ఎన్నికలో దివంగత గౌతమ్ రెడ్డి సతీమని శ్రీకీర్తి రెడ్డి పోటీ చేస్తారంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. ఆ అవకాశం శ్రీకీర్తిరెడ్డి కాకుండా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డికి ఇవ్వాలని మేకపాటి కుటుంబం నిర్ణయించింది. ఈ విషయాన్నే సీఎం జగన్ కు వివరించి, తన రెండో కుమారుడు విక్రమ్ రెడ్డి పేరును ఖరారు చేయించే దిశగా కీలకమైన చర్చలు జరుపుతారని తెలుస్తోంది. నిజానిని మేకపాటి కుటుంబంలోని మహిళలెవరూ రాజకీయాల్లోకి వచ్చే సాంప్రదాయంలేదు. దాని ప్రకారమే శ్రీకీర్తిరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారానికి ఇప్పటికే మేకపాటి కుటుంబ సభ్యులు తెర దించారు. కేవలం మగవారు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు. ఈ విషయమే సీఎం జగన్ కు వివరించి, శ్రీకీర్తికి కాకుండా విక్రమ్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఒప్పించేందుకే రాజమోహన్ రెడ్డి భేటీ అవుతున్నారని చెబుతున్నారు.
కాగా.. మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తిరెడ్డికి ఉప ఎన్నికల బరిలో దింపాలని, ఆమెను గెలిపించి, మంత్రి పదవి కూడా కట్టబెట్టాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ దిశగా వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా శ్రీకీర్తిరెడ్డిని ప్రోత్సహించారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో మేకపాటి తమ కుటుంబంలో మహిళలు రాజకీయాల్లోకి రారని తేల్చి చెప్పి, విక్రమ్ ను అభ్యర్థిగా ప్రకటించాలనే ప్రతిపాదనను సీఎం జగన్ ఒప్పుకుంటారో లేక.. శ్రీకీర్తిరెడ్డి పేరునే మళ్లీ తెరమీదకు తీసుకువస్తారా? అనే టెన్షన్ నెల్లూరు జిల్లా వైసీపీ కార్యకర్తల్లో మొదలైంది.
ఒక విధంగా చెప్పాలంటే.. గడచిన మూడేళ్లుగా వైఎస్ జగన్ గుమ్మం కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి తొక్కలేదు. తాజా పరిణామాలు జగన్ వద్దకు మేకపాటి రాజమోహన్ రెడ్డిని వెళ్లేలా చేశాయా? ఒక వేళ ఈ భేటీ సందర్భంగా శ్రీకీర్తిరెడ్డికి అవకాశం ఇద్దామని జగన్ అంటే రాజమోహన్ రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎవరనే స్పష్టత జగన్- రాజమోహన్ రెడ్డి భేటీలో ఫైనల్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి జగన్ పంతం నెగ్గుతుందా?.. రాజమోహన్ రెడ్డి పట్టుదల గెలుస్తుందో?