ఆ సమస్యని తెదేపా-బీజేపీలు పరిష్కరించుకోగలవా?
posted on Dec 5, 2015 10:59AM
.jpg)
విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో శనివారం తెదేపా-బీజేపీ నేతల సమన్వయ సమావేశం జరుగబోతోంది. రెండు పార్టీల మధ్య తలెత్తున భేధాభిప్రాయాలను, వాటి కారణాల గురించి చర్చించి సమస్యలను పరిష్కరించుకోవడం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెదేపా, బీజేపీ అధ్యక్షులు కిమిడి కళావెంకట రావు, కంబంపాటి హరిబాబు, బీజేపీ మంత్రులు డా. కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ నేత సోము వీర్రాజు తదితరులు పాల్గొంటారు.
తమ మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు తలెత్తుతున్నాయో, వాటికి మూల కారణాలు ఏమిటో ఈ సమావేశంలో పాల్గొనబోతున్న వారందరికీ స్పష్టంగా తెలుసు. కనుక వారి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలను తొలగించుకొనే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోదనే విషయం దాదాపు స్పష్టమయిపోయింది. దానిని ప్రజలు, తెదేపా నేతలు కూడా అర్ధం చేసుకొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేనప్పుడు కనీసం బిహార్ రాష్ట్రానికి ప్రకటించినట్లుగా భారీ ఆర్ధిక ప్యాకేజీ అయినా కేంద్రప్రభుత్వం మంజూరు చేస్తుందని రాష్ట్ర ప్రజలు చాలా కాలంగా ఆశగా ఎదురు చూస్తున్నారు. వారితో బాటే తెదేపా నేతలు కూడా ఎదురు చూస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడి బిహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకి అడగకుండానే భారీ ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటించారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితులు చూస్తున్నా కూడా ఇంతవరకు ప్యాకేజీ ప్రకటించలేదు. సహజంగానే అందుకు ప్రజలు, ప్రభుత్వం, తెదేపా నేతలు, ప్రతిపక్షాలు ఆగ్రహంగా ఉన్నారు. బహుశః రాష్ట్ర బీజేపీ నేతలలో కూడా ఈ విషయంలో అసంతృప్తిగానే ఉండి ఉండవచ్చును. కానీ పైకి చెప్పుకోలేని నిస్సాహయతలో ఉన్నారు. తమ పార్టీపై, కేంద్రప్రభుత్వంపై తెదేపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నపుడు చూస్తూ మౌనంగా ఉండలేరు కనుక వారు కూడా ప్రతివిమర్శలు చేయవలసి వస్తోంది. కేంద్రం మంజూరు చేస్తున్న పధకాలు, నిధుల గురించి మాట్లాడకుండా తమపై విమర్శలు చేయడం సరికాదని వారు వాదిస్తున్నారు. అలాగే కేంద్రం సహాయంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెదేపా ప్రభుత్వం తన స్వంతవిగా ప్రచారం చేసుకొంటూ పూర్తి క్రెడిట్ స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని వారి ఆరోపణ. రాష్
ట్ర ప్రభుత్వం తమను ఆ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మధ్య భేదాభిప్రాయలకి మూల కారణం కేంద్రం హామీలను అమలు చేయకపోవడం, చేస్తున్న వాటిని తెదేపా ప్రభుత్వం స్వంతం చేసుకోవడమేనని స్పష్టం అవుతోంది. మొదటిది కేంద్రప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం కనుక దానిని ఏవిధంగా పరిష్కరించుకోవాలనే విషయం ఇరు పార్టీల నేతలు నేటి సమావేశంలో చర్చించుకోవడం మంచిది.
ఇక కేంద్ర పధకాలను తెదేపా ప్రభుత్వం తనవిగా చెప్పుకొంటోందనే బీజేపీ నేతల ఆరోపణలలో బయటకు కనబడని మరో కోణం కూడా ఉన్నట్లుంది. సరిగ్గా అదే కారణంతో లేదా భయంతోనో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఉదారంగా నిధులు మంజూరు చేయడం లేదేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అదే కారణమయితే, రాష్ట్రంలో బీజేపీ నేతలను కూడా ప్రతీ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయడం ద్వారా ఆ సమస్య పరిష్కరించుకోవచ్చును. అప్పుడు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు, ఇతర హామీలను అమలు చేయవచ్చును. సమస్యకు ఇదే మూలకారణమయితే రెండు పార్టీలు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. లేకుంటే చివరికి వారే నష్టపోతారు.