రాహుల్ కష్టపడకుండా ప్రధాని* అయిపోయే చాన్స్?

 

ఒకప్పుడు కాంగ్రెస్ అధిష్టాన దేవత నించోమంటే నించొని, కూర్చోమంటే కూర్చొన్న ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దానికే షరతులు పెట్టగలుగుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడిన ప్రాంతీయ పార్టీల నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తమలాగే మరో ప్రాంతీయ పార్టీలాగనో అంతకంటే తక్కువగానో చూస్తున్నారు. పాపం..కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వంటి వాళ్ళు కూడా ప్రధానమంత్రి కావలసిన రాహుల్ గాంధీ అంతటి వాడిని పట్టుకొని ‘నా స్నేహితుడు’ అనేస్తున్నారు.

 

అంతటితో ఆగితే పరువాలేదు. “వచ్చే ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మా పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తులు కోరుకొన్నట్లతే, మా నేతాజీని...అదే...మాడాడీ ములాయం సింగ్ యాదవ్ ని ప్రధాన మంత్రిని చేస్తామని చెప్పండి...మీతో పొత్తులకి ఇప్పుడే ఒకే చేప్పేస్తానని,” అఖిలేష్ యాదవ్ ఈరోజు మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక సందేశం పంపించారు. అంతే కాదు రాహుల్ గాంధి కష్టపడకుండా అధికారం చేపట్టేందుకు అఖిలేష్ యాదవ్ మంచి ఆఫర్ కూడా ఇచ్చేరు. తన తండ్రిని ప్రధానమంత్రిని చేసినట్లయితే, తాము రాహుల్ గాంధిని ఉప ప్రధానిని చేస్తామని ప్రకటించేశారు.

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు రాహుల్ గాంధి కోసం ప్రధానమంత్రి కుర్చీలో కర్చీఫ్ వేసి ఉంచినా అప్పుడు ఆ బాబు అందులో కూర్చోవడానికి చాలా భయపడ్డారు. ఆ తరువాత నరేంద్ర మోడీ వచ్చి ఆ కర్చీఫ్ ని తీసి పక్కన చెత్తబుట్టలో పడేసి అందులో ఏకంగా పెద్ద పరుపు, దుప్పటి, దిండు అన్నీ వేసేసుకొని సెటిల్ అయిపోయారు. ఆయన తీరు, ట్రాక్ రికార్డులని బట్టి చూస్తుంటే మరో పది పదిహేనేళ్ళ వరకు అందులో నుంచి ఆయనకీ లేచే ఉద్దేశ్యం ఉన్నట్లు కనబడటం లేదు.

 

ఇటువంటి పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ ఇస్తున్న ఆఫర్ ని స్వీకరించి ములాయం పక్కన ఓ చిన్న కుర్చీవేసుకొని సెటిల్ అయిపోవడమా...లేక ప్రస్తుతం తమ పార్టీ రాజేసిన ‘మత అసహనం’ పొగ భరించలేక ఒకవేళ మోడీ ఆ కుర్చీలో నుండి లేచిపోతారేమోనని వేచి చూడడమా...? అనే అయోమయంలో పడింది కాంగ్రెస్ పార్టీ. ‘ఎలాగు మోడీకి పొగ పెట్టాము కదా...దాని భరించలేక ఒకవేళ ఆయనంతట ఆయన లేచిపోతారేమోనని ఎదురు చూద్దామా’ అంటే ఈలోగానే వచ్చే ఏడాదే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వచ్చేస్తున్నాయి.

 

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవు కనుక ‘అక్కి ప్రపోజల్’ కి ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకొంటే కాంగ్రెస్ తలదించుకోవలసి వస్తుంది. “రాహుల్ గాంధి నాయకత్వ లక్షాణాలు లేవని మేము మొదటి నుండి మొత్తుకొంటూనే ఉన్నాము కదా...చెపితే వినరూ...అంటూ” పార్టీలో అసంతృప్తి రాగాలు వినవలసి వస్తుంది. వాళ్ళని ఎదుర్కోవడానికి రాహుల్ గాంధి మళ్ళీ అర్జెంటుగా విదేశాలకు వెళ్లి చార్జింగ్ చేసుకొని రావలసి వస్తుంది.

 

అలాగని అఖిలేష్ యాదవ్ ఇస్తున్న ఈ ఆఫర్ ని కాదంటే ఈలోగా ఆయన మరెవరి చెయ్యో పట్టుకొన్నట్లయిటే, అప్పుడు మాయావతిని బ్రతిమాలుకోవలసి వస్తుంది అది ఇంకా కష్టం. ఆమె కూడా ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోవాలని చాలా కాలంగా కలలు కంటోంది. కనుక ఆమె కూడా రాహుల్ గాంధిని తన పక్కన చిన్న కుర్చీలో సర్దుకుపోమని కోరవచ్చును. అయినా ప్రాంతీయ పార్టీలు కూడా రాహుల్ గాంధీకి ఇలాగ అగ్నిపరీక్షలు పెట్టేస్తున్నాయేమిటి...బొత్తిగా చిన్నా పెద్ద చూడకుండా! ఏమిటో పాపం!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu