విజయ్‌కాంత్‌కు పొంచి ఉన్న మరో ముప్పు...
posted on May 20, 2016 5:13PM

ఎదో తెలుగు సినిమాలో ఒక పాటుంది.."అంతన్నాడు..ఇంతన్నాడే గంగరాజు" అని ఎన్నికలకు ముందు తనంతటి వాడు లేడన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడాడు.. సీఎం కుర్చీ ఈ సారి ముమ్మాటికీ తనదేనన్నాడు.. తన తోటి నటుడ్ని పిరికివాడన్నాడు..ఆయనేవరో ఈ పాటికే మీకు అర్ధమై ఉంటుంది. ఆ మహానుభావుడు ఎవరో కాదు సినీనటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్. తమిళనాడు ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతారనుకున్న కెప్టెన్ బొక్కబొర్లాపడ్డారు. సారీ.. అమ్మ హవాలో కొట్టుకుపోయారు. డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ప్రజా సంక్షేమ కూటమిగా ఏర్పడి ఆ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచారు విజయ్‌కాంత్. సీఎం కుర్చీ సంగతి పక్కన బెడితే తన సీటు కూడా కాపాడుకోలేకపోయారు. ఉలందూరుపేట నుంచి పోటీ చేసిన కెప్టెన్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.
ఓటమితో ముఖం చూపించుకోలేకపోతున్న విజయ్‌కాంత్‌కు మరో గండం పోంచి ఉంది. ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు కలిగి ఉండాలి. పీడబ్ల్యూపీతో జతకట్టి కెప్టెన్ పెద్ద పొరపాటు చేశారని అదే కరుణతో చేతులు కలిపినట్లైతే ఫలితాలు మరోలా ఉండేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2006 ఎన్నికల్లో విజయ్‌కాంత్ ఒంటరిగా బరిలోకి దిగి కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుని 10 శాతం ఓట్లు దక్కించుకున్నారు. 2011లో అన్నాడీఎంకేతో జట్టుకట్టి అమ్మ దయతో 29 సీట్లు గెల్చుకున్నారు. జయ విధానాలు నచ్చకపోవడంతో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు తమ కూటమిలో చేరాలని ఆహ్వానించినా తానే సీఎం కావాలనే లక్ష్యంతో నాలుగు పార్టీలతో ఏర్పడిన పీడబ్ల్యూఎఫ్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఈ నిర్ణయం పార్టీకి చేటు తెస్తుందని సీనియర్లు వారించినా కెప్టెన్ వినలేదు. చివరకు అదే నిర్ణయం ఆయనకు శరాఘాతమైంది.