నీట్‌పై కేంద్రం కొత్త ట్విస్ట్..

మెడికల్, బీడీఎస్ ప్రవేశాల్లో దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ ఉండాలంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై రోజుకోక వివాదం రేగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలోకి కేంద్రప్రభుత్వం ఎంటరై..కొత్త ట్విస్ట్ ఇచ్చింది. నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ  ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఇప్పటికే మే 1న తొలి విడత నీట్ పరీక్షను దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు రాశారు. జూలై 24న రెండో విడత నీట్ జరగాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు నీట్‌ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలతో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్ పరీక్షలకు ఎలాంటి విలువ లేకుండా పోయింది. దీంతో మెడికల్, బీడీఎస్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులంతా నీట్ తప్పక రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దాదాపు 14 రాష్ట్రాలు నీట్ రద్దు చేయాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి.

 

నీట్ నిర్వహణపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, కార్యదర్శులతో చర్చించారు. ఈ సమావేశంలో సుప్రీం తీర్పుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించి ప్రధాని నిర్ణయం కోసం వేచి చూశారు. ఇవాళ మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో నీట్, సుప్రీంకోర్టు, రాష్ట్రాల అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతిమంగా ఒక సంవత్సరం పాటు నీట్‌ను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీని వల్ల మెడికల్, డెంటల్ సీట్లకు ఆయా రాష్ట్రాల పరిధిలోనే అడ్మిషన్లు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ , ప్రైవేట్ మేనేజ్‌మెంట్ సీట్లకు మాత్రం నీట్‌ ద్వారానే అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ నిర్ణయం పట్ల తెలుగు రాష్ట్రాలు హర్షం వ్యక్తం చేశాయి. నీట్ టెన్షన్‌ నుంచి ఆర్డినెన్స్‌ ద్వారా ఉపశమనం కల్పించినందుకుగాను కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖ మంత్రి గంటా, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu