‘నంది’ అవార్డుల పేరు మారుస్తాం

 

తెలుగు సినిమా రంగానికి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న నంది అవార్డుల పేరు మార్చనున్నామని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసానీ శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో మూడు పేర్లు వున్నాయని ఆయన చెప్పారు. తెలుగు సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన అన్నారు. సోమవారం సచివాలయంలో తలసాని శ్రీనివాసయాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీనివాస్ యాదవ్ సినిమా పరిశ్రమతోపాటు ఇతర పరిశ్రమల గురించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ ఆరు నెలల పాలన తర్వాత వ్యాపారుల్లో విశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు. కాకపోతే బంగారం, వెండి ఆభరణాల వ్యాపారులు పూర్తిస్థాయిలో ట్యాక్స్ చెల్లించడం లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నగరంలో బంగారు దుకాణాలు అధికంగా ఉన్న అబిడ్స్, ప్యాట్నీ, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లోని బంగారు వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.