సారీ చెప్పిన ఫేస్‌బుక్

 

ఫేస్‌బుక్ తన వినియోగదారులకు సారీ చెప్పింది. కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా ఫేస్‌బుక్ యూజర్లు ఉపయోగించిన ఫొటోలు, పంపిన సందేశాలను క్రోడీకరించి ఫేస్‌బుక్ వారి అకౌంట్లలలో ఒక పోస్టు ఆటోమేటిగ్గా పెడుతోంది. ఆ సంవత్సరం వారు చేసిన కొన్ని పోస్టులు అందులో కనిపిస్తాయి. ఫేస్‌బుక్ పంపిన పోస్టులో పైన ఈ సంవత్సరం అద్భుతంగా గడిచిందనే అర్థం వచ్చే మాట పెట్టింది. అయితే పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు తమకు సంతోషం కలిగించిన అంశాలతోపాటు తమకు ఇష్టమైనవారు చనిపోవడం లాంటి బాధాకరమైన అంశాలను కూడా పోస్టు చేస్తూ వుంటారు. వాటిని కూడా ఫేస్‌బుక్ తన పోస్టులో వచ్చేలా చూసింది. దానివల్ల తమ జీవితంలో జరిగిన విషాదానికి ఫేస్‌బుక్ వినియోగదారులు ఆనందిస్తున్నట్టుగా అర్థం మారిపోయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోగదారులు మనసు కష్టపెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకురావంతో ఫేస్‌బుక్ నిర్వాహకులు జరిగిన పొరపాటును గ్రహించి నాలుక కరచుకున్నారు. ఫేస్‌బుక్‌ ఈ పోస్టును ఆటోమేటిగ్గా క్రియేట్ చేయడం వల్ల ఏది సంతోషకరమైన పోస్టో, ఏది బాధాకరమైన పోస్టో గ్రహించలేకపోయామని వివరణ ఇచ్చారు. ఈ పొరపాటుకు సారీ కూడా చెప్పారు.