ఆ వర్గాన్ని టార్గెట్ చేసిన శ్రీదేవి! ఆడియో లీక్‌తో కలకలం
posted on Nov 12, 2020 2:23PM
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియా కాల్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తాజా ఆడియోలో రెడ్డి సామాజిక వర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు శ్రీదేవి. రెడ్లు చాలా డేంజర్ అని ఆమె కామెంట్ చేశారు. మనల్ని ఎంతసేపు వాళ్లకు అడ్డం రాకుండా వాడుకొని వదిలేస్తారని ఎమ్మెల్యే అన్నట్లు ఆడియోలో ఉంది. అధికారం అంతా వాళ్ల చేతల్లో పెట్టుకుని మనల్ని ఎలా అణగతొక్కాలా అని మనసులో ఉంటుందని ఆడియోలో చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే. స్థానిక నేతలతో ఉన్న విభేదాలను కూడా సందీప్ అనే వ్యక్తితో శ్రీదేవి మాట్లాడినట్లుగా వైరల్ అవుతున్న ఆడియోలో ఉంది. ఎస్సీలు, బీసీలు ఒకటిగా ఉండాలని శ్రీదేవి మాట్లాడినట్లుగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, కోన రఘుపతి, అప్పిరెడ్డితో పాటు చాలా మంది నేతల పేర్లు కూడా ఆడియోలో ఎమ్మెల్యే శ్రీదేవి ప్రస్తావనకు తెచ్చారు
గతంలోనూ ఎమ్మెల్సే శ్రీదేవికి సంబంధించిన ఓ ఆడియా తీవ్ర దుమారం రేపింది. గత ఆడియోలో పేకాట విషయమై సందీప్-శ్రీదేవి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. టీడీపీలో ప్రత్తిపాటి పుల్లారావు, మోదుగుల క్లబ్‌లు నడిపించారని.. మనం కూడా పేకాట ఆడిద్దామని సందీప్‌తో శ్రీదేవి చెప్పినట్లుగా ఆడియోలో ఉంది. ఫిరంగిపురం మండలంలో ఆడిద్దామని శివరామిరెడ్డి చెబుతున్నారని.. 5 శాతం ఇస్తామని చెబుతున్నారని కూడా అందులో ఉంది. చాలా డబ్బులు వస్తాయని శివరామిరెడ్డి చెబుతున్నాడని.. ఏం చేయాలో చూడాలని సందీప్‌తో ఎమ్మెల్యే శ్రీదేవి చర్చించినట్లు స్పష్టంగా ఉంది. ఎమ్మెల్యేతో మాట్లాడిన సందీపే ఆ ఆడియోను రిలీజ్ చేశారు.
గతంలో సందీప్ విడుదల చేసిన ఆడియో టేపు విషయంలో శ్రీదేవి స్పందిస్తూ.. తాడికొండ పీఎస్‌లో నలుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. తన మాజీ అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయాల్లో తాను ఎదుగుతుంటే చూడలేక ఇలా రాళ్లు వేస్తున్నారని.. అంతేకాదు తన వెంట మారణయుధాలతో తిరుగుతున్నారని శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. తన గొంతును మార్ఫింగ్ చేసి ఫేక్ ఆడియోలు విడుదల చేస్తున్నారని కూడా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే శ్రీదేవి కేసు తనపై కేసు పెట్టడంతో సందీప్ కూడా స్పందించారు. సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఎమ్మెల్యే శ్రీదేవి కేసు పెట్టడంపై సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం వైఎస్ జగనే తనను కాపాడాలని వీడియోలో వేడుకున్నాడు. నాపై అక్రమ కేసులు పెట్టడంతో అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నాకు చావు తప్ప మరో మార్గం కనిపించటం లేదని వీడియోలో సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ ధర్మేంద్ర, ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పారు. శ్రీదేవికి కష్టకాలంలో అండగా ఉన్నానని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని ఆమె కంటతడి పెట్టుకుంటే.. తనకు తెలిసినవాళ్ల దగ్గర తానుమధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించానని తెలిపారు. ఇప్పుడు ఆ డబ్బులు అడుగుతుంటే..ఇవ్వకుండా తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని సెల్పీ వీడియోలో సందీప్ తెలిపారు.
గత ఆడియో వివాదం , సందీప్ సెల్ఫీ విడియో ప్రకంపనలు కొనసాగుతుండగానే.. తాజాగా మరో ఆడియో బయటికి రావడంతో ఎమ్మెల్యే శ్రీదేవి ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో ఆమె కలవరపడుతున్నట్లు చెబుతున్నారు. తాజా ఆడియోలో ఆమె రెడ్డి వర్గ నేతలను టార్గెట్ చేయడంతో.. వారంతా ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొత్తంగా గత వివాదానికి ఫుల్ స్టాప్ పడకముందే మళ్లీ ఎమ్మెల్యే కొత్త వ్యవహారం వెలుగుచూడటంతో తాడికొండలో రాజకీయం మరింత ముదిరింది.