ఎంఐఎం ఎమ్మెల్యేను అడ్డుకున్న బీజేపీ! పాతబస్తీలో టెన్షన్
posted on Nov 12, 2020 2:25PM
హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రిని అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా గౌలిపురాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ప్రారంభించడానికి వచ్చారు ఎంఐఎం ఎమ్మెల్యే. బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆయన్ను అడ్డుకున్నారు.
ఎమ్మెల్యేకు మద్దతుగా ఎంఐఎం కార్యకర్తలు భారీగా రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎంఐఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే పాషాఖాద్రిని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో గౌలిపురాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులను మోహరించారు.