వలస పక్షులను కాటేస్తున్న కాలుష్యం!

కాలుష్యం పర్యావరణానికి చేస్తున్న హాని ఇంతా అంతా కాదు. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కాలుష్యం.. పశుపక్ష్యాదుల ఉసురు కూడా తీస్తున్నది. ముఖ్యంగా జలాలలోకి పరిశ్రమల వ్యర్థాలను యథేచ్ఛగా విడుదల చేస్తుండటంతో  వలస పక్షులు బలి అవుతున్నాయి. ప్రతి శీతాకాలంలో విదేశాల నుంచి వలస వచ్చి హైదరాబాద్ శివారు కిష్టారెడ్డి పేట్ సరస్సును ఆవాసంగా చేసుకునే విదేశీ పక్షులు జల కాలుష్యం కాటుకు బలి అవుతున్నాయి.  కిష్టారెడ్డిపేట్ సరస్సులోకి పరిశ్రమల వ్యర్థాలను యథేచ్ఛగా విడుదల చేస్తుండటమే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వలస పక్షుల కిలకిలారావాలతో వీనులకు, కన్నులకు విందుగా విలసిల్లాల్సిన కిష్టారెడ్డి పేట్ సరస్సు నేడు ఆ వలస పక్షులకు అంతిమ విడిదిగా మారిపోయింది.   సంగారెడ్డి- మేడ్చల్ జిల్లాల మధ్యలో ఉన్నఈ సరస్సులోకి చుట్టుపక్కల ఉన్న ఫార్మా, కెమికల్ కంపెనీల నుంచి వ్యర్థ కలుషిత జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ సరస్సు వలస పక్షుల  పాలిట శాపంగా మారిన పరిస్థితులు దాపురించాయి.

పరిశ్రమల వ్యర్థాలను సరస్సులోకి విడుదల చేయకుండా నియంత్రించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి ఆ పని చేయకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని పర్యావరణ ప్రేమికులు విమర్శిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వలస పక్షులు మరణించడంతో చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రంగంలోకి దిగారు. పరిశ్రమల నుంచి వెలువడిన కాలుష్యం ఒక్కటే కాదు, గృహాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి సరస్సులో కలపడం వల్ల కూడా సరస్సు జలం కలుషితమైందనీ, అందుకే పక్షులు పెద్ద సంఖ్యలో మరణించాయనీ అంటున్నారు. కిష్టారెడ్డిపేట్ సరస్సులోని నీటి నమూనాలను సేకరించారని, పరీక్షల్లో నీరు కలుషితమైందని తేలితే అందుకు కారణమైన పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు.   

అసలు పటాన్ చెరు ప్రాంతంలోని పలు పరిశ్రమలు నిబంధనలను తుంగలోకి తొక్కి యథేచ్ఛగా వ్యర్థాలను సరస్సులోకి విడుదల చేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు అంటున్నారు. ఈ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా జనం కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని ఆరోపిస్తున్నారు.