తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే పిల్లలకు సోషల్ మీడియా అక్కౌంట్లు!

సోషల్ మీడియా చేస్తున్న మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన సర్వత్రా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా కారణంగా పిల్లలు దారి తప్పుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. వాస్తవానికి అది నిజం కూడా చిన్న వయస్సు నుంచే సోషల్ మీడియా ఎడిక్ట్ లుగా మారిపోతున్న పిల్లలు చదువు, ఆటలకు దూరం అవుతున్నారు. ఇది వారిలో మానసిక సమస్యలకూ దారి తీస్తున్నది.

ఈ నేపథ్యంలో కేంద్రం పిల్లలకు సోషల్ మీడియా అక్కౌంట్లపై నియంత్రణ తీసుకురావాలని నిర్ణయించింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు సోషల్ మీడియాలోకి రావాలంటే అందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తప్పని సరి చేయాలన్న నిర్ణయం తీసుకుంది.  కేంద్రం తాజాగా ప్రచురించిన  డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2025  ముసాయిదా నిబంధలన ప్రకారం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి.

ఈ ముసాయిదాపై అభ్యంతరాలు తెలియజేయడానికి ఫిబ్రవరి 18 తుదిగడువుగా పేర్కొంది. ఆ లోగా పిల్లల  సోషల్ మీడియా అక్కౌంట్ లకు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి అన్న దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయనుంది.  ఆ తరువాత పిల్లలకు సోషల్ మీడియా ప్రవేశానికి తల్లిదండ్రుల అనుమతిని తప్పని సరి చేస్తూ చట్టం తీసుకురానుంది.