రసవత్తరంగా గూడెం రాజకీయాలు
posted on Mar 14, 2014 6:50AM
.jpg)
తాడేపల్లిగూడెం.. ఈ పట్టణం పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయాలకు ప్రధాన కేంద్రం. ఇక్కడ మునిసిపల్ చైర్మన్ దగ్గర్నుంచి ఎమ్మెల్యే వరకు ఏ ఎన్నిక జరిగినా రాజకీయాలు రసవత్తరంగా మారుతూనే ఉంటాయి. 1985 నుంచి 1999 వరకు వరుసగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. 85లో ఎర్రా నారాయణస్వామి, 89, 94లలో పసల కనకసుందరరావు, మళ్లీ 99లో ఎర్రా నారాయణస్వామి ఇక్కడ టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో 99 ఎన్నిక బాగా ఉత్కంఠభరితంగా సాగింది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ బాగా బలమైన అభ్యర్థి అని ప్రచారం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తర్జనభర్జన పడి.. నారాయణ స్వామిని పిలిపించి మరీ పోటీ చేయించారు. అప్పటికి ఆయనతో పోలిస్తే కొట్టు సత్యనారాయణ యువకుడు కావడం, ప్రచారం ఉధృతంగా చేయడంతో ఫలితాలను ఎవరూ ఊహించలేపోయారు. చివరకు ఎర్రా నారాయణస్వామే గెలిచారు.
తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైఎస్ హవాతో కొట్టు సత్యనారాయణ గెలిచారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా ఈలి నాని, కాంగ్రెస్ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ, టీడీపీ నుంచి ముళ్లపూడి బాపిరాజు పోటీపడ్డారు. ముగ్గురికీ 40వేల ఓట్లకు పైగానే వచ్చాయి. బాపిరాజుకు 41282 ఓట్లు రాగా, కొట్టు సత్యనారాయణకు 45727 వచ్చాయి. 3020 ఓట్ల తేడాతో.. అంటే 48747 ఓట్లు సాధించిన ఈలి నాని విజేత అయ్యారు. తర్వాత పీఆర్పీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవడంతో ఇప్పుడాయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. అయితే.. ప్రస్తుత రాజకీయం మరింత చిత్రంగా ఉంది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అటు కొట్టు సత్యనారాయణ గానీ, ఇటు ఈలి నాని గానీ సుముఖంగా లేరు. ఒక దశలో జగన్ పార్టీలోకి కొట్టు వెళ్తారనుకున్నా, అక్కడ అప్పటికే తోట గోపికి టికెట్ దాదాపుగా ఖరారు కావడంతో ఊరుకున్నారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ దక్కుతుందో, ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారోనన్న విషయం మంచి ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా పోరాడిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీ టికెట్ కోసం కొట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు తాడేపల్లిగూడెం టిక్కెట్పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి బాపిరాజు, ఎర్రా నారాయణస్వామి మనవడు ఎర్రా నవీన్ లకు ఈ రాజకీయాలతో దిమ్మ తిరిగిపోతోంది.