‘జానా‘.. బెత్తెడేనా?
posted on Mar 14, 2014 6:56AM
.jpg)
ఎప్పుడు ఏ సమావేశం జరిగినా పెద్దమనిషిలా, పెద్ద విగ్రహంతో కనిపించే జానారెడ్డి ఇప్పుడు చిన్నబోయారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తాను కీలక పాత్ర పోషిస్తానని ఆయన భావించారు. కాబోయే ముఖ్యమంత్రిని తానేనని కూడా ఓ దశలో ప్రచారం చేసుకున్నారు. మొదటి తెలంగాణా పీసీసీ పదవి తనకే దక్కుతుందని ఎదురు చూశారు. ఇప్పుడు అన్నీ అడియాసలయ్యాయి. కీలక పాత్ర కాదు కదా, చివరకు ఏ పాత్రా ఆయనకు దక్కేలా కనిపించట్లేదు. తెలంగాణా పీసీసీ అధ్యక్ష పదవిని పొన్నాల లక్ష్మయ్యకు ఇచ్చేశారు. తెలంగాణాకు దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రకటించారు. దాంతో ఎన్నో కలలు కన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం మంత్రిగా కొనసాగిన రికార్డు ఉన్న జానారెడ్డి ఒక్కసారిగా డీలాపడ్డారు.
నిజానికి తెలంగాణా జేఏసీ ఏర్పాటులో జానారెడ్డిదే కీలకపాత్ర. అప్పట్లో రాష్ట్ర సాధనకు అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లాలంటూ ఆయన పెద్దమనిషి పాత్రను పోషించారు. తర్వాతి కాలంలో అదికాస్తా టీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు సొంత పార్టీ వాళ్లు కూడా ఆయనను కూరలో కర్వేపాకులా తీసి పక్కన పారేస్తున్నారని ఆయన అనుచరులు వాపోతున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే, జానారెడ్డికి ఇంటిపోరు కూడా ఎక్కువైంది. జానా వారసుడుగా రఘువీర్ రాజకీయాలలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న డిమాండ్ ఇంట్లోనుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్న రాహుల్ ఫార్ములాతో అసలుకే ఎసరు వస్తుందేమోనని ఆందోళన పడుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యం తెలంగాణా రాష్ట్రంలో కూడా నెరవేరే అవకాశం కనిపించకపోవడంతో రఘువీర్ కు రాజకీయ వారసత్వం అప్పగించి రిటైర్ కావాలని జానారెడ్డి అనుకుంటున్నట్లు వినవస్తోంది.