ఈ ఐక్యత అప్పుడేమయింది?
posted on Jun 21, 2015 9:06PM

తెలంగాణ జర్నలిస్టుల్లో వెల్లువెత్తి ఉరకలు వేస్తున్న ఐకమత్యాన్ని చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోయి, కళ్ళలోంచి ఆనందబాష్పాలు జలజలా రాలుతున్నాయి. తెలంగాణ పోరాటం సందర్భంగా టీ జర్నలిస్టులందరూ ఒక్కతాటి మీద నిలిచి ఉద్యమించిన తీరు చూశాం. తెలంగాణ సిద్ధించిన తర్వాత మరోసారి వారి ఐకమత్యాన్ని చూసి తరించే భాగ్యం కలిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చెందిన టీ-న్యూస్ ఛానల్ చంద్రబాబు మాట్లాడిన మాటలంటూ టేపులు ప్రసారం చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ ఛానల్‌కి నోటీసులు ఇచ్చారు. ఈ విషయం టి న్యూస్ ఛానల్లో పనిచేసే ఉద్యోగులకు, యాజమాన్యానికి ఆగ్రహం తెప్పించడం సహజం. అయితే ఆ సంస్థలోని ఉద్యోగులు, జర్నలిస్టులతోపాటు ఇతర మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు, జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌కి కూడా ఆగ్రహం పొంగుకొచ్చేసింది. టీ న్యూస్ ఛానల్‌కి నోటీసులు ఇవ్వడం అన్యాయం, అక్రమం, దారుణమంటూ తెలంగాణ జర్నలిస్టులు ఐకమత్యంగా నినదిస్తున్నారు. ఈ ఐకమత్యం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే ఇదే ఐకమత్యాన్ని, ఇదే ఆగ్రహాన్ని కొంతకాలం పాటు టీవీ9 ఛానల్ మీద, ఇప్పటి వరకూ ఏబీఎన్ ఛానల్ మీద అమలు చేస్తున్న అనధికార నిషేధం విషయంలో ఎందుకు ప్రదర్శించలేదో అర్థం కాని విషయం. ఇప్పుడు టీ న్యూస్ ఛానల్ విషయంలో ఒక్కటై నినదిస్తున్న జర్నలిస్టులు గత సంవత్సరకాలంగా నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఏబీఎన్ ఛానల్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో! మీడియా స్వేచ్ఛ అంటూ ఇప్పుడు నినదిస్తున్న గళాలు ఏబీఎన్ విషయంలో ఎందుకు మూగబోయాయో!