ట్యాపింగ్ కేసులో పట్టు బిగుస్తోంది

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో ఎలా వ్యవహరించబోతోందా అనే విషయం అస్పష్టంగా వుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ట్యాపింగ్ వ్యవహారంలో పట్టు బిగిస్తోంది. హైదరాబాద్‌లో, అది కూడా టీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో వున్న టీ న్యూస్ కార్యాలయంలోకి అర్ధరాత్రి సమయంలో ఏపీ పోలీసులు వెళ్ళి నోటీసులు ఇచ్చి వచ్చారంటే, ఈ కేసు విషయంలో ఏపీ ఎంత పట్టుదలగా వుందో, పట్టును పెంచుకుంటోందో అర్థమవుతోంది. టీ న్యూస్‌తో ఆగకుండా సాక్షి ఛానల్‌కి కూడా నోటీసులు ఇవ్వడం ఈ కేసు విషయంలో ఏపీ పోలీసులకు వున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలిస్తోంది. అక్కడితో ఏపీ పోలీసులు ఆగలేదు. మరో పెద్ద ముందడుగు వేశారు. 12 మంది సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేశారు. సోమవారం లోగా తమకు ట్యాపింగ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని నోటీసులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తమ మీద ఇంత త్వరగా దాడి చేస్తుందని సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఊహించలేదు. వీళ్ళకు ఇచ్చిన నోటీసులలో భాగంగా ఇచ్చిన ప్రశ్నావళి సర్వీస్ ప్రొవైడర్ల కళ్ళు తిరిగేలా చేసింది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తే ఇక ఈ కేసులో ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రశ్నావళి అంత పకడ్బందీగా వుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఈ ఘనకార్యంలో పాలు పంచుకున్నారని, ఈ వ్యవహారం మొత్తాన్ని ఇల్లీగల్‌గా చక్కబెట్టారని, టార్గెట్ చేసిన వ్యక్తులతోపాటు వారికి సంబంధించిన వ్యక్తుల ఫోన్లను కూడా గుట్టు చప్పుడు కాకుండా ట్యాప్ చేశారని, ఈ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లను కూడా బెదిరించారని ఏపీ పోలీసులు కనుగొన్నారని తెలుస్తోంది. అందుకే ఇంత దూకుడు ప్రదర్శిస్తున్నారని సమాచారం.