దప్పికగొన్న వారి వద్దకే బావి.. సుప్రీం వ్యాఖ్య
posted on Apr 19, 2023 10:09AM
వలస కార్మికులకు రేషన్ కార్డుల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద జనాభా నిష్పత్తి లెక్కలు సరిగా లేవన్న సాకుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు రేషన్ కార్డులను నిరాకరించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వలస కార్మికుల సంక్షేమం కోసం ముగ్గురు సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అహ్ సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ విచారణ సందర్భంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు పౌరులందరికీ లబ్ది కలిగించాలి. ఆ బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రభుత్వాలు తమ విధుల నిర్వహణలో విఫలమయ్యాయని అనడంలేదనీ, కొంత మందికి ఇప్పటికీ ప్రయోజనాలు అందడంలేదన్నది వాస్తవమనీ, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి, వారికి రేషన్ కార్డులు అందేలా చూడాలనే చెబుతున్నామని పేర్కొంది. కొన్నిసార్లు.. దాహంతో ఉన్నవారి వద్దకే బావి వెళ్లాల్సి ఉంటుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దాహం వేస్తే..బావి దగ్గరకు వెళ్లాలి.. బావి మన దగ్గరకు రాదనే సామెతను ఉటంకిస్తూ .. సుప్రీంకోర్టు ఒక్కోసారి బావే దాహంతో ఉన్న వాడి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుందని చేసిన వ్యాఖ్యతోనైనా వలస కార్మికుల సంక్షేమం దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.