కర్నాటకలో కాంగ్రెస్ కోసం రఘువీరా ప్రచారం
posted on Apr 19, 2023 11:33AM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. గత నాలుగేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారానికి సిద్ధమయ్యారు. రాజకీయాల్లోకి పునప్రవేశం గురించి ఆయనే స్వయంగా ప్రకటన చేశారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమైన రఘువీరా, రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావించినప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సోనియా కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండటం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.
పార్టీ కీలక నేత రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు బనాయించి వేధించడం, ఆయనకు రెండేళ్లు శిక్షపడటం, కోర్టు తీర్పు వచ్చీరాగానే పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేయడం, నివాస బంగళాను కూడా ఖాళీ చేయించడం వంటి పరిణామాలు బాధించాయనీ, ఇటువంటి సమయంలో సోనియా కుటుంబానికీ, పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని రఘువీరా అన్నారు. రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్న బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారని రఘువీరా చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బాధ్యతను చేపట్టాలన్న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచనల మేరకు సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని తెలిపారు.
1989 నుండి కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 10 నుండి 12 నియోజకవర్గాలలో తాను ప్రచారం నిర్వహించడం రివాజుగా వస్తున్నదన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని, ఇక్కడి నుంచే బీజేపీ పతనం మొదలవుతుందని రఘువీరా అన్నారు.
తెలంగాణ విషయం పక్కన పెడితే.. ఆంధ్రలో కాంగ్రెస్ జాడ దాదాపుగా లేనే లేదు.. ఇలాంటి పరిస్థితిల్లో ఆయనొచ్చి చేసేదేమి లేదు. అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ, ప్రశ్నిస్తామని వచ్చిన పార్టీ జనసేన.. ఈ పార్టీల మధ్య ..ఇప్పుడు కాంగ్రెస్ ను పట్టించుకునే వారు ఏరి...?