చదువుకున్న వారికే పగ్గాలు.. మోడీకి విద్యార్హతలు లేవని కేజ్రీ తేల్చేశారా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా ఢిల్లీ  అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి   అరవింద్ కేజ్రివాల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధానిమోడీ లక్ష్యంగా ఢి ద్రవ్యోల్బణం లాంటి సమస్యల్లో దేశం చిక్కుకుంటే, దేశ పాలకుడు చదువుకున్నవాడా, లేదా అన్నది ప్రజలు తనిఖీ చేసుకోవాలని అన్నారు. విద్యావంతుడికే పగ్గాలు అప్పగించాలని సూచించారు. తాను చదువుకున్న ముఖ్యమంత్రినని, అందుకే ఢిల్లీలో ఉచిత విద్యుత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని.. ఇది నచ్చని మోడీ ప్రభుత్వం.. తనపై కక్ష సాధింపుచర్యలకు దిగుతోందని ఆరోపించారు.

మద్యం కుంభకోణం కేసులో తనను సీబీఐ దాదాపు తొమ్మిది గంటల సేపు విచారించిన  నేపథ్యంలో  కేజ్రివాల్ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక సమావేశాన్ని  ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా వ్యతిరేకించినా.. వెనక్కి తగ్గలేదు. శాసనసభలో మోడీకి, భాజపాకు వ్యతిరేకంగా ఆప్  తీర్మానం చేసింది. ప్రధానమంత్రి తన శక్తిని, ఏజెన్సీలను ఎంతగా వెచ్చించినా.. ఆప్ ఎదుగుదలను ఆపలేరని కేజ్రీ ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు శాసనసభ సమావేశానికి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని కూడా ఆప్ తీవ్రంగా పరిగణించింది. దీన్ని సభాహక్కుల కమిటీకి నివేదించాలని తీర్మానించింది. ఈ విషయంలో గవర్నర్ కు సమన్లు జారీ చేయాలా లేదా అన్న విషయాన్ని కూడా కమిటీ నిర్ధారించాలని కోరింది.

ప్రధాని మోడీ చదువుకోలేదని.. ఆయన సమర్పించిన  విద్యార్హత సర్టిఫికెట్లు నకిలీలని కేజ్రీవాల్ 2016 ముందు నుంచే ఆరోపిస్తున్నారు. గుజరాత్ కోర్టు .. ఆ విషయం మీకనవసరం అంటూ తీర్పు ఇచ్చి 25,000  జరిమానా  కూడా విధించింది.  అయినా కేజ్రీవాల్ తగ్గడం లేదు. మోడీ విద్యార్హతలపై తన ఆరోపణలను కొనసాగిస్తున్నారు.