విచారణలో ఉన్న కేసుపై న్యాయమూర్తి ఇంటర్వ్యూ.. సుప్రీం అసహనం
posted on Apr 25, 2023 10:37AM
కొందరు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణలో ఉన్న కేసులపై న్యాయమూర్తులు వార్తా సంస్థలకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏ విధంగా చూసినా సమర్థనీయం కాదని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ లో పాఠశాల ఉద్యోగాలను ముడుపులు తీసుకుని అమ్మేశారన్న ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఓ వార్తా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్టాడారంటూ పిటిషనర్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అయిన అభిషేక్ బెనర్జీ సుప్రీం దృష్టి కి తీసుకువెళ్లారు.
ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన కాపీని కూడా అందజేశారు. ఈ వ్యవహారాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి. ఎస్. నరసింహలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. జస్టిస్ గంగోపాధ్యాయ్ ఇంటర్వ్యూ ఇచ్చారో లేదో గురువారంలోగా తమకు తెలియజేయాలని కలకత్తా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. తాజా ఆదేశాల వల్ల ఈ కేసులో సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ల దర్యాప్తునకు అడ్డంకులు తలెత్తుతాయంటూ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్. వి. రాజు లేవనెత్తిన అనుమానాలను ధర్మాసనం తోసిపుచ్చింది.
అవి దర్యాప్తును యధావిధిగా కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. ఏక సభ్య ధర్మాసనం ఎదుట పెండింగ్ లో ఉన్న కేసుపై న్యాయమూర్తి ఇంటర్వ్యూ ఇవ్వడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొ న్నారు. పిటిషనర్ గురించి ముఖాముఖిలో జడ్జి మాట్లాడిన సంగతి నిజమే అయితే.. కేసు విచారణ నుంచి ఆయన స్వయంగా తప్పుకొని ఉండాల్సిందని అన్నారు. వార్తా ఛానెల్ ఇంటర్వ్యూలో జస్టిస్ గంగోపాధ్యాయ్ తనకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసినట్లు పిటిషనర్ ఆరోపించారు.
కాగా హైకోర్టులలో కొందరు న్యాయమూర్తుల ఉత్తర్వులు, వ్యాఖ్యలపై సుప్రం కోర్టు ఇటీవల పలు సందర్భాలలో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలుపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై కూడా సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ అన్ వారెంటెడ్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.