ఏళ్ల తరబడి దూరమే.. సయోధ్య ఎండమావే..!
posted on Apr 25, 2023 10:20AM
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య సయోధ్య ఎండమావిగానే మారింది. రెండున్నరేళ్లుగా ఎడ ముఖం, పెడ ముఖంగా ఉన్న గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర హై కోర్టు ప్రమేయంతోనే అయినా, శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో రాజ్యాంగ విధులను రాజ్యాంగబద్దంగా నిర్వర్తించారు. దీంతో అంతా ఇక రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య దూరం చెరిగిపోయినట్లేనని అంతా భావించారు.
గత సంవత్సరం తరహాలోనే ఈ సంవత్సరం కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు కానిచ్చేయాలని కేసీఆర్ సర్కార్ భావించినా, బడ్జెట్ ఆమోదం కోసం కోర్టు మెట్లు ఎక్కినా ప్రయోజనం లేక పోయింది. కోర్టు సూచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఒకడుగు వెనక్కివేసి గవర్నర్ తో సయోధ్యకు సుముఖత వ్యక్తం చేసింది. ఆ విధంగా శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్, సంప్రదాయాన్ని పాటిస్తూ, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని అక్షరం పొల్లుపోకుండా చవివినిపించారు. గవర్నర్ తమ రాజ్యాంగ కర్తవ్యాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా, అనివార్యంగానే అయినా తమ రాజ్యాంగ విధులను నిర్వర్తించారు. గవర్నర్ కు ఇవ్వవలసిన గౌరవం ఇచ్చారు. దీంతో అనుమానాలున్నా, రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సయోధ్య కుదిరిందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇది జరిగిన వారం వ్యవధిలోనే సయోధ్య ఒట్టిమాటేనని తేలిపోయింది.
గవర్నర్ పసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై సభలో జరిగినలో ముఖ్యమంత్రి పాల్గొనలేదు. ముఖం చాటేశారు.గవర్నర్ పేరు ప్రస్తావించడం గవర్నర్ కు కృతఙ్ఞతలు చెప్పడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి ముఖం చాటేశారని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. మరో వంక ముఖ్యమంత్రి బదులుగా ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఆయన, అదే విధంగా చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ ప్రసంగంలో లేని అంశాలను ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంత్రి కేసీఆర్ అయితే తమ సహజ ధోరణిలో కేంద్ర ప్రభుత్వాననే కాదు, ప్రధానిమోడీని, బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వ విధానాలను, అనర్గళంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషలలో తిట్టి పోశారు. సో.. సర్కార్ సైడు నుంచి చూస్తే, గవర్నర్’తో సయోధ్యకు ప్రభుత్వం సిద్ధంగా లేదనే విషయం అప్పుడే స్పష్టమైంది. మరోవంక గవర్నర్ తమిళి సై, గత శాసన సభ సమావేశాల్లో ఆమోదించిన ఆరు బిల్లులకు ఆమోదం తెలపలేదు. నిజానికి, కోర్టు వెలుపల కుదిరిన ఒప్పందం ప్రకారం పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్ అంగీకరించారనే ప్రచారం జరిగింది. కానీ, రాజ్ భవన్’నుంచి సానుకూల సంకేతాలు రాలేదు.
ఈ పరిస్థితుల్లోనే సర్కార్ పెండింగ్ బిల్లుల ఆమోదంపై సుప్రీం ను ఆశ్రయించారు. గవర్నర్ వద్ద పెండింగ్ పడుతున్న బిల్లుల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు సోమవారం (ఏప్రిల్ 24) విచారణ జరిపింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తరఫున వాదనలు వినిపించిన ఎస్జీ.. ప్రస్తుతం గవర్నర్ వద్ద ఏ బిల్లులు పెండింగ్ లో లేవని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని బిల్లులను మాత్రం తిప్పి పంపారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే.. ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వం గవర్నర్ దయ కోసం చూడాల్సిన పరిస్థితి వస్తోందని అన్నారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్టు.. బిల్లులను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయాలని రాజ్ భవన్ కు సూచిస్తూ ప్రస్తుతం బిల్లులు పెండింగ్ లో లేవు కాబట్టి ఈ పిటిషన్ ను ముగిస్తున్నామని తెలిపింది.
గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. అసెంబ్లీలోని ఉభయ సభలు ఆమోదించిన పది బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పాలనకు ఇబ్బందిగా మారుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇది ఇప్పటికే ఓసారి విచారణకు వచ్చింది. గతంలో విచారణకు రాగా.. తన వద్ద ఉన్న పెండింగ్ బిల్స్‌ను క్లియర్ చేశారు గవర్నర్. అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్లో మూడింటిని ఆమోదించినట్టు రెండింటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు మొన్నటి విచారణకు సుప్రీంకోర్టుకు తెలిపారు. మూడే బిల్లులు గవర్నర్ పరిశీలనలో ఉన్నట్టు రాజ్‌భవన్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. గతంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న వేళ ఆ మూడింటినీ క్లియర్ చేశారు. ఇంత చేసినా ప్రగతి భవన్.. రాజ్ భవన్ ల మధ్య దూరం మరింత పెరిగిందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదనే భావించాలి.