‘స్టెప్పా మార్‌..’ అంటూ అదరగొడుతున్న రామ్‌.. మాస్‌ ఆడియన్స్‌కి పండగే!

రామ్‌ పోతినేని, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. పాన్‌ ఇండియా మూవీగా ఆగస్ట్‌ 15న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ఫస్ట్‌ సాంగ్‌ ‘స్పెప్పామార్‌’ రిలీజ్‌ అయింది. ఈ సాంగ్‌లో తన స్టెప్పులతో అదరగొట్టేశాడు రామ్‌. ఈ పాట రిలీజ్‌ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రామ్‌, పూరి ఫస్ట్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మాస్‌ ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చేసింది. లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో ఉన్న రామ్‌ను ఒక్కసారిగా పక్కా మాస్‌ హీరోగా మార్చేసిన సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఈ సినిమా సాధించిన ఘనవిజయంతో సెకండ్‌ పార్ట్‌ని అంతకంటే భారీ అంచనాల మధ్య విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు విడుదలైన ఫస్ట్‌ సాంగ్‌తో సినిమా ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేశారు. ‘స్టెప్పా మార్‌’ అంటూ సాగే పాట ఆడియెన్స్‌లో ఒక ఊపు తీసుకొచ్చింది. ఎనర్జీకి మారు పేరుగా చెప్పుకునే రామ్‌ ఈ పాటలో తన హై ఎనర్జీతో అద్భుతమైన స్టెప్స్‌ వేసి శభాష్‌ అనిపించుకున్నాడు. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన స్టెప్పులు ఈ పాటకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రంలో సంజయ్‌దత్‌ విలన్‌గా ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. రామ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్‌ 15న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.