ఆంద్రప్రదేశ్ కి సిరులు కురిపించే శ్రీ సిటీ

 

చెన్నై నగరానికి కేవలం 55కిమీ దూరంలో ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో చిత్తూరు వద్ద ఏర్పాటు చేసిన శ్రీ సిటీ పారిశ్రామికవాడలో 25 దేశాలకు చెందిన 104 చిన్నాపెద్దా పరిశ్రమలు గత ఐదేళ్ళుగా పనిచేస్తున్నాయి. వాటిలో పిల్లలు ఆడుకొనే ఆట వస్తువులు మొదలుకొని ట్రక్కులు, భారీ యంత్రసామాగ్రి వరకు తయారవుతున్నాయి. జపాన్ దేశానికి చెందిన ఆటోమొబైల్ పరికరాలు తయారు చేసే సంస్థ ‘ఐసన్’ అక్కడే తమ పరిశ్రమను స్థాపించబోతున్నట్లు ప్రకటించింది.

 

“మొదట మేము బెంగళూరులో మా సంస్థను స్థాపించాలని అనుకొన్నప్పటికీ మా వినియోగదారులయిన నిస్సాన్ మరియు టొయోటా కంపెనీలు తమిళనాడులో శ్రీపెరంబూరులో ఉన్నందున వాటికి దగ్గిరగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇక్కడే మా సంస్థను స్థాపించాలని నిర్ణయించుకొన్నాము,” అని ఆ సంస్థకి చెందిన జే. సెంథిల్ కుమార్ తెలిపారు.

 

ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు సువిశాలమయిన ఖాళీ స్థలాలు ఉండటమే కాక అన్ని విధాల అభివృద్ధి చేయబడి ఉండటం, నిరంతర విద్యుత్ సరఫరా కలిగి ఉండటం, ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలకు వేగంగా సరుకు రవాణా చేసుకొనే అవకాశం కలిగిఉండటం వంటి కారణాల వల్ల ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. ద్విచక్ర వాహన తయారీలో దేశంలో ప్రసిద్ది చెందిన హీరో మొటోకార్ప్ సంస్థ త్వరలోనే ఇక్కడ ఉత్పత్తి మొదలుపెట్టబోతోంది.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనలలో అక్కడి పారిశ్రామికవేత్తలకు ఈ శ్రీసిటీ ప్రత్యేకతలను వివరించి అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించగలిగారు. జపాన్ కి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇసుజు శ్రీసిటీలో తన ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించేందుకు సిద్దమయింది. జపాన్, అమెరికాలతో సహా మరో మూడు దేశాలకు చెందిన సంస్థలు ఈ శ్రీసిటీలో దాదాపు రూ.19,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చినట్లు శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సనారెడ్డి చెప్పారు. వాటిలో కొన్ని సంస్థలతో చర్చలు తుది దశలో ఉంటే, మరి కొన్ని నిర్మాణానికి సిద్దంగా ఉన్నాయని అయన తెలియజేసారు. కేంద్రప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం నిన్న ప్రకటించిన రాయితీల వల్ల ఇక్కడకి మరిన్ని పరిశ్రమలు తరలిరావచ్చని ఆశించవచ్చును.