జగన్ ఫ్యాన్స్ ఆందోళన

 

ఎలాంటి వారికైనా కొంతమంది ఫ్యాన్స్ వుంటారు. దానికి కారణం వారి దగ్గర వున్న డబ్బు కావచ్చు.. వారి వల్ల గతంలో పొందిన లాభం కావొచ్చు.. భవిష్యత్తులో ఉపయోగపడతాడన్న ఆశ కావొచ్చు... ఇతనూ మనలాంటివాడేనన్న అభిమానం కావచ్చు... ఎలాంటి వ్యక్తిత్వం వున్నవారినైనా అభిమానించేవారు కొందరు ఉంటారన్నది ఖాయం. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే మన వైసీపీ నాయకుడు జగన్. తన తండ్రిని అడ్డుగా పెట్టుకుని ఈయన లక్షల కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే లక్షల కోట్ల ఆస్తులున్నాయి. సీబీఐ కేసులున్నాయి... అన్నిటికీ మించి 16 నెలల జైలు జీవితం వుంది... ఇంకా చెప్పాలంటే బోలెడన్ని సాక్ష్యాధారాలున్నాయి. మొత్తమ్మీద జగన్ వైట్ కాలర్ నేరస్తుడన్న విషయం దేశంలో ఎవర్ని అడిగినా తడుముకోకుండా చెబుతారు. అయితే అలాంటి జగన్‌ని కూడా కొంతమంది అభిమానిస్తారు. అందుకే ఆయనకు గత ఎన్నికలలో కొన్ని స్థానాలు వచ్చాయి. అవి ఏ మార్గంలో వచ్చాయన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. అలా జగన్ని అభిమానించేవారు ఇప్పుడు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎలాంటి ఫ్లాష్‌బ్యాక్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పార్టీని కొద్ది స్థానాల్లో అయినా గెలిపించారు. 16 నెలలో జైల్లో వున్నా చివరికి బెయిల్ దొరికింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటూ, నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తే బాగుంటుంది కదా అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం ప్రతిక్షణం అధికార పార్టీ మీద విరుచుకుపడుతూ, అయిన దానికీ కానిదానికీ ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి తంటాలు పడుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వాన్ని ఏదోరకంగా బద్నామ్ చేయడానికి జగన్ పడుతున్న తంటాలు చూసి ఆయన అభిమానులు బాధపడుతున్నారు. అద్భుతమైన రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తే జగన్ సార్ పేరు కూడా చరిత్రలో నిలుస్తుంది కదా.. అలా కాకుండా అడ్డం తగులుతూ చరిత్ర లేకుండా అయిపోతాడే అని బాధపడుతున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి తనవంతు సహకారం అందిస్తే జనంలో కాస్తయినా సానుభూతి వస్తుంది కదా అనుకుంటున్నారు. జగన్ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే, రేపు ఎప్పుడైనా జగన్ జైల్లో పడితే కనీసం అయ్యోపాపం అనుకునేవాళ్ళు కూడా జనాల్లో మిగలరని జగన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.