జగన్, కేసీఆర్ పై సోము విమర్శల వర్షం.. కారణం అదేనా?

కూటమి పార్టీలలో ఎవరికీ ఇష్టం లేకపోయినా.. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధిష్ఠానం ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయిపోయారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏపీ నేతలు ఎవరూ కూడా అధిష్ఠానం నుంచి సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఆఘ‘మేఘా’లపై వస్తుందని ఊహించలేదు. చివరి నిముషంలో కమలం సోము వీర్రాజు పేరు ప్రతిపాదించి, అంతే వేగంగా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ఆమోదముద్ర వేయించుకుని తెలంగాణ నుంచి ఓ విమానంలో సోము పేరు మీద బీఫాంను, హస్తిన నుంచి మరో విమానంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని అమరావతిలో ల్యాండ్ చేసింది. అలా చివరి నిముషాలలో సోము వీర్రాజు చేత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన వేయించింది. అది పక్కన పెడితే.. ఎవరి వాడూ కాకుండానే ఏపీలో ఎమ్మెల్సీ అయిపోయిన వీర్రాజు ఇప్పుడు కూటమి పార్టీల్లో అందరి వాడు అనిపించుకోవడానికి నానా తంటాలూ పడుతున్నారు. 

అసలు 2024 ఎన్నికలకు ముందు పొత్తును గట్టిగా వ్యతిరేకించిన బీజేపీ నేత ఎవరైనా ఉన్నారంటే అది సోము వీర్రాజు మాత్రమే. పైకి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే లక్ష్యమంటూ కబుర్లు చెప్పినా, తెలుగుదేశంతో బీజేపీ, జనసేనలు జట్టు కట్టకుంటే జగన్ కు ప్రయోజం చేకూరుతుందన్న ఉద్దేంతోనే సోము వీర్రాజు గతం మరిచిన గజనీలా వైసీపీ అధినేత సోము జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు గుప్పిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినా  జగన్ విషయంలో సోముకు ఇంకా సాఫ్ట్ కార్నర్ పోలేదనే పరిశీలకులు అంటున్నారు. తాజాగా ఆయన జగన్, కేసీఆర్ లపై విమర్శలు గుప్పించారు.

అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో జగన్ వి ద్వంద్వ ప్రమాణాలన్నారు. మరో సారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటున్నారనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదని జోస్యం చెప్పారు. అదే సమయంలో కేసీఆర్ పై మాత్రం తీవ్ర స్థాయిలో విరుకుకుపడ్డారు. కేసీఆర్ ను గుంటనక్కతో పోల్చారు. కేసీఆర్ మానసిక సమతుల్యం కోల్పోయారనీ, ఆయనకు రాత్రిళ్లు నిద్రపోలేరరనీ, వింత వింత రాజకీయ వ్యాఖ్లు చేస్తున్నారనీ సోము విరుచుకుపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి పదేళ్ల పాటు అధికారం చెలాయించారనీ, ఆయన నిజస్వరూపం తెలిసిన తరువాత జనం ఛీకొట్టారనీ సోము అన్నారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం పని చేస్తోందన్నారు.. అదే సమయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు, కుమార్తె, మేనల్లుడు పెరిగితే చాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. మొత్తం మీద సోము వీర్రాజు అనూహ్యంగా కేసీఆర్ ప్రస్తావన తీసుకువచ్చి మరీ విమర్శలు గుప్పించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైంది. 

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి పొత్తులే కారణమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే సోము వీర్రాజు ఈ విమర్శలు చేశారని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకూ జగన్ కు గట్టి మద్దతుదారైన సోము వీర్రాజు ఏకకాలంలో జగన్ ను ఆయన మిత్రుడు కేసీఆర్ ను విమర్శించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ మనిషిగా ముద్రపడిన వీర్రాజు ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.