ఢీ.. లిమిటేషన్.. దక్షిణాది రాష్ట్రాల భయాలేంటి?!

ఆలు లేదు చూలు లేదు .. కొడుకు పేరు సోము లింగం అన్నట్లు, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం పై, ఏడు రాష్ట్రాలకు చెందిన 14 పార్టీల నాయకులు చెన్నై లో సమావేసమయ్యారు. అయితే, దాహం వేసినప్పడు బావిని తవ్వడం కంటే, రేపటి అవసరాన్ని ముందుగానే గుర్తించి, ముందుగానే పలుగు పార ఎత్తడం విజ్ఞత అనిపించుకుంటుంది. సో.. నియోజక వర్గాల పునర్విభజన ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, అడుగు ముందు కేయడం తప్పేమీ కాదు. అయితే, ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఇటూ అటూ కూడా ఆచి తూచి అడుగులు వేయడం అవసరం. 

నిజానికి డిలిమిటేషన్ కు సంబందించి కేంద్ర ప్రభుత్వం మనసులో ఏముందో  ఎవరికీ తెలియదు. ఇందుకు సంబందించి, దక్షిణాది రాష్ట్రాల్లో  ‘ఒక్క’ సీటు కూడా తగ్గదు అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా  చేసిన ప్రకటన తప్ప  కేంద్రం నోటి నుంచి మరొక్క మాట బయటకు రాలేదు. అసలు కేంద్రం మనసులో ఏముందో  తెలియక  పోవడమే కాదు.. ఇటు  నుంచి  మరో పాతికేళ్ళు, లోక్ సభ స్థానాల సంఖ్య విషయంలో  యథాతథ స్థితిని కొనసాగించాలనే ప్రతిపాదన తప్ప మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏదీ పస్పుటంగా బయటకు రాలేదు. అదొకటి అయితే అసలు డిలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభానికే ఇంకా చాలా సమయం వుంది. అంతకు ముందు జనగణన జరగాలి. జనగణనతో ముడి పడిన కుల గణన కుంపటి ఒకటి అలా  రగులుతూనే వుంది.

ఈ అన్నిటినీ మించి మరో పాతికేళ్ళ పాటు, పునర్విభజన జోలికి వెళ్లరాదని, 2001 వాజపేయి ప్రభుత్వం విధించిన గడవు 2026లో గానీ ముగియదు. ఆ గడువు ముగిసన తర్వాతనే పునర్విభజన గురించి ఆలోచన చేస్తామని, అంతవరకు పునర్విభజన జరిపేది లేదని గతంలోనే మోదీ ప్రభుత్వం పార్లమెంట్ కు స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా లోక్’సభ.శాసన సభ సీట్ల సంఖ్యను పెంచాలని, బీఆర్ఎస్ నోటి మాటగానే కాదు లిఖిత పుర్వకంగానూ సమాధానం ఇచ్చింది. 

అయితే  జనాభా దామాషా ప్రాతిపదికన లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  లేవనెత్తిన ఆందోళన  దక్షణాది రాష్ట్రాలను ఏకం చేసింది. ఈ నేపధ్యంలో దక్షిణాది రాష్టాల ఐక్య వేదిక పురుడు పోసుకుంది. ఐక్య వేదిక తొలి సమావేశం ఆదివారం(మార్చి 22) చెన్నైలో  జరిగింది.  తమిళ నాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకే స్టాలిన్  నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరయ్యారు. అలాగే  కేరళ ముఖ్యమంత్రి  విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగంత్ మాన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ తోపాటుగా మరికొందరు ముఖ్యనాయకులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఐక్య పోరాటం సాగించాలని తీర్మానం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకేసి ‘‘జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న ఈ పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లోని మనం రాజకీయ గళం కోల్పోతాం. ఉత్తరాది మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించి వేస్తుంది. అప్పుడు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ వంటి రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తాయి అని సీఎం రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దీనికి అంగీకరించకూడదని,  దీనికి వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు, పార్టీలు, నేతలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతే కాదు, 

పునర్విభజన ప్రక్రియపై రాష్ట్ర శాసన సభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగిలిన రాష్ట్రాల్లోనూ తీర్మానం చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నేతలకు రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పునర్విభజనపై తదుపరి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తానని, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అప్పుడు చర్చిద్దామని ప్రతిపాదించారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని, దక్షిణాదిలోని ప్రతి ఒక్కరూ హక్కుల రక్షణకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఒక విధంగా చూస్తే, తమిళనాడు సిఎం  స్టాలిన్ లేవనెత్తిన అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చంక నెత్తు కున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి  డీకే శివకుమార్ కూడా సభకు హజరైనా, రేవంత్ రెడ్డి కొంచెం ఎక్కువ చురుగ్గా వ్యవహరించడం.. తదుపరి సమావేశం హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించడం విషయంలో రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక మవుతున్నాయి, అలాగే  ఈ విష యం లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే పడవలో ప్రయాణించడం పట్ల కూడా  అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.