కుర్రవాళ్లకి నిద్ర ఎందుకు పట్టదు!

పిల్లలు చీకటిపడితే చాలు, బుద్ధిగా పడుకుంటారు. కానీ ఇలా టీనేజిలోకి అడుగుపెడతారే లేదో... రాత్రిళ్లు వీలైనంత మేలుకునే అలవాటు మొదలవుతుంది. ఇంతకీ కుర్రకారుకి రాత్రివేళలు ఎందుకు నిద్రపట్టదు. పగలు పుస్తకమే ముట్టుకోనివారు రాత్రిళ్లు నైట్‌ అవుట్ చేయాలనీ, బండి మీద చక్కర్లు కొట్టాలనీ ఎందుకు ఉవ్విళ్లూరుతారు... అంటే ఈ మధ్య జరిగిన ఓ పరిశోధనలో జవాబు దొరికినట్లే కనిపిస్తుంది.

 

వేల సంవత్సరాల నుంచి వస్తున్న అలవాట్లే, మనం వేర్వేరు సమయాలలో నిద్రపోవడానికి కారణం అవుతున్నాయా! అనే అనుమానంతో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన మొదలుపెట్టారు. ఇందుకోసం టాంజానియాలో ఆటవిక జీవితాన్ని గడుపుతున్న హజ్డా అనే తెగలోని వారిని పరిశీలించారు. వీరు 20 లేదా 30 మంది కలిసి ఓ గుంపుగా ఉంటారు. ఉదయాన్నే లేచి ఆడామగా ఆహారం కోసం బయల్దేరతారు. కొందరు దుంపలు, కాయలు తీసుకువస్తే.... మరికొందరు జంతువులని వేటాడి తీసుకువస్తారు. సాయంత్రం వేళకి అందరూ ఒక చోటకి చేరి, తాము తెచ్చుకున్నది శుభ్రంగా తిని హాయిగా పడుకుంటారు. గడ్డి, కొమ్మలతో నేసిన గుడిసెలలో ఎలాంటి ఫ్యాన్లూ, లైట్లూ లేకుండా హాయిగా నిద్రపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే- వేల సంవత్సరాల క్రితం మప పూర్వీకులు ఎలా జీవించేవారో, హెజ్డా ప్రజలు అదే తీరున జీవిస్తున్నారు.

 

ఈ హెజ్డాతెగలో 20 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఓ 33 మందిని పరిశోధన కోసం ఎన్నుకొన్నారు. వారి నిద్రను గమనించేందుకు, అభ్యర్థులందరికీ ఓ వాచిలాంటి పరికరాన్ని అమర్చారు. ఇలా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తల దిమ్మ తిరిగిపోయింది. వీళ్లలో రాత్రి ఒకో సమయంలో ఒకొక్కరు మెలకువగా ఉన్నారట! మొత్తమ్మీద 33 మందీ ఒకేసారి గాఢంగా నిద్రపోయిన సమయం పట్టుమని 20 నిమిషాలు కూడా లేదు. మెలకువగా ఉండటమో, పొగ తాగేందుకు లేవడమో, లేచి పిల్లలని చూసుకోవడమో, మరోవైపుకి ఒత్తిగిలి పడుకోవడమో... ఇలా ఏదో ఒక చర్యతో గుంపులో ఎవరో ఒకరు జాగరూకతతో కనిపించారు.

 

అడవులలో జీవించేవారు రకరకాల ప్రమాదాలకి సిద్ధంగా ఉండాల్సిందే! ఏ వైపు నుంచి పులి వస్తుందో, ఏ దిక్కు నుంచి మబ్బులు కమ్ముకువస్తాయో, ఏ పొదలోంచి పాములు చొరబడతాయో తెలియదు. కాబట్టి.... ఎవరో ఒకరు అప్రమత్తంగా ఉండేందుకు ప్రకృతి ఈ ఏర్పాటు చేసిందన్నమాట. ఏ ఇద్దరి నిద్రతీరు ఒకేలా లేకపోవడంతో, గుంపు సురక్షితంగా ఉంటుంది.

అది సరే! ఇంతకీ నిద్రకీ వయసుకీ సంబంధం ఏమిటి? అన్న ప్రశ్న అలాగే మిగిలిపోయింది కదా! ఒక గుంపులో కుర్రవాళ్లు, వృద్ధులు సరిసమానంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కుర్రవాళ్లు ఒక సమయంలో, వృద్ధులు మరో సమయంలో పడుకుంటే సరి! అందుకనే మీరు గమనించారో లేదో.... కుర్రవాళ్లకి ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేచే అలవాటు ఉంటే, ముసలివారు త్వరగా పడుకుని తెల్లవారేసరికల్లా లేస్తారు. కుర్రవాళ్లు ఆలస్యంగా పడుకున్నా వారి ఆరోగ్యం మీద అంతగా ప్రభావం చూపదు కదా! అలా మొదలైన అలవాటు ఇప్పటికీ కుర్రకారుని వదిలిపెట్టడం లేదన్నమాట!

- నిర్జర.