ఇంట్లో దుమ్ముతో... లావైపోతారు!
posted on Jul 14, 2017 12:21PM
రోజంతా నానాకష్టాల పడే మధ్యతరగతి జీవులు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి సేదతీరుదామా అనుకుంటారు. ఇంట్లోకి అడుగుపెట్టి సోఫాలో కూలబడి వేడివేడి టీ తాగుతూ.... ఇల్లే కదా స్వర్గసీమ! అని మురిసిపోతారు. కానీ అజాగ్రత్తగా ఉంటే ఆ ఇల్లే నరకంగా మారిపోతుందని హెచ్చరస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటారా...
ఇల్లన్నాక రకరకాల వస్తువులు, వాటి నుంచి పేరుకునే దుమ్ము సహజమే. కానీ ఈమధ్యకాలంలో మనం వాడే వస్తువులన్నీ ప్రమాదకరమైన రసాయనాలతో తయారవుతున్నవే కదా! దోమల్ని చంపే మందులు, మంటలు వ్యాపించకుండా వాడే పైపూత, నాన్స్టిక్ వంటపాత్రలు... ఒకటేమిటి షాంపూ దగ్గర నుంచి ప్లాస్టిక్ దాకా అన్నీ రసాయనాలే! ఈ రసాయనాలలో Endocrine-disrupting chemicals (EDC) అనే పదార్థాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు.
ఈ EDCలు మనలోని హార్మోనులని దెబ్బతీస్తాయి. ఫలితంగా కేన్సర్, ఎదుగుదలలో లోపాలు, నరాల బలహీనత, అబార్షన్ వంటి సమసస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకనే చాలా సంస్థలు తమ ఉత్పత్తులలో ఈ తరహా రసాయనాలు లేకుండా జాగ్రత్తపడుతున్నాయి. అయితే ఈ EDCలతో మన శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు కణాలు పెరిగిపోతాయేమో అన్న అనుమానం పరిశోధకులకి మొదలైంది.
EDCలకీ కొవ్వు కణాలకీ మధ్య సంబంధాన్ని తేల్చపారేసేందుకు కొన్ని ఇళ్లలో దుమ్ముని సేకరించారు. ఇలా సేకరించిన శాంపిల్స్లో రసాయనాలు ఏ తీరున ఉన్నాయి, అవి కొవ్వు కణాల మీద ఎంత ప్రభావం చూపుతున్నాయి అని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా దాదాపు 90 శాతం ఇళ్లలో కనిపించిన ధూళికణాలు, మన శరీరంలోని కొవ్వుని ప్రభావితం చేస్తున్నాయని తేలింది. కొవ్వు కణాలు త్వరగా వృద్ధి చెందడానికీ, ప్రమాదకరమైన ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికీ ఇవి కారణం అవుతున్నాయట!
ఇంట్లో అనవసరమైన సామాను పోగుచేయకూడదనీ, ఒకవేళ తీసుకున్నా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలనీ ఈ పరిశోధనతో తేలిపోయింది. సామాను కొనేటప్పుడు కూడా చవకగా దొరుకుతోందనో, సులువుగా పని జరిగిపోతోందనో కాకుండా... నాణ్యత ఉన్న వస్తువునే తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వస్తువుల నుంచి వచ్చే EDC మన ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థలలోకి చాలా తేలికగా ప్రవేశిస్తాయట. ఇక ఆ తర్వాత జరిగే కథ ఇప్పటికే తెలిసిపోయింది కదా!
- నిర్జర.