బాక్సింగ్‌లో వరుసగా ఆరో నాకౌట్ సాధించిన విజేందర్

భారత స్టార్ బాక్సర్‌ విజేందర్ సింగ్ పంచ్‌ల్లో తనకు సాటి లేదని నిరూపించాడు. కెరిర్‌లో వరుసగా ఆరో బౌట్‌లోనూ నాకౌట్ విజయం సాధించాడు. నిన్న బోల్టన్‌లోని మార్కాన్ స్టేడియంలో జరిగిన సమరంలో పోలెండ్‌కు చెందిన ఆండ్రెజ్‌ సోల్డ్రాను అతడు మట్టికరిపించాడు.  తొలి రౌండ్‌ నుంచే బాడీషాట్‌లు, బలమైన పంచ్‌లతో విజేందర్ విరుచుకుపడ్డాడు. దీంతో ఆరు రౌండ్‌ల బౌట్‌లో మరో మూడు రౌండ్‌లు మిగిలి ఉండగానే ఫలితం తేల్చేశాడు . విజేందర్ పంచ్‌ పవర్‌కి సోల్డ్రా దిమ్మ తిరిగిపోయింది. కనీసం పోరాడే స్థితిలో ఉన్నట్టు కూడా అతడు కనిపించలేదు. రిఫరీ సాంకేతిక నాకౌట్ ద్వారా విజేందర్ గెలిచినట్టు ప్రకటించాడు.