టాలీవుడ్ పై ఏపీ సర్కార్ గురి‌.. ప‌వ‌న్ మాట‌లతో క్లారిటీ!

టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీ ఏపీ వైపు చూస్తున్నదా? క్ర‌మంగా ఏపీలో సినీ ఇండ‌స్ట్రీ ఏర్పాటుకు అడుగులు ప‌డుతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానమే సినీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఇటీవ‌ల పుష్ప‌2 సినిమా బెనిఫిట్ షో సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై తెలంగాణ స‌ర్కార్  సీరియస్ కావడం, ఆ తరువాత తీసుకున్న నిర్ణయాలతో సినీ ప్ర‌ముఖులు కాస్త‌ ఇబ్బందిప‌డిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్ర‌ముఖుల‌కు ద‌గ్గ‌రి వ్య‌క్తి. చాలా మంది సినీ హీరోలు, సినీ పెద్ద‌ల‌తో రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ, పుష్ప‌2 ఘ‌ట‌న విష‌యంలో మాత్రం రేవంత్ స‌ర్కార్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించింది. దీంతో కాస్త ఇబ్బందిగా ఫీలైన సినీ ప్ర‌ముఖులు తెలంగాణ‌తోపాటు ఏపీలోనూ సినీ ఇండ‌స్ట్రీని అభివృద్ధి  చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఏపీలో ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు, ఉప‌ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉండ‌టంతో సినీ పెద్ద‌ల చూపు ఏపీ వైపు మ‌ళ్లింద‌ని సినీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సినీ ఇండ‌స్ట్రీలోని కొంద‌రు ప్ర‌ముఖులు ఈ విష‌యంపై చర్చించారనీ,  ప్ర‌భుత్వం త‌ర‌పున కావాల్సిన అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్ప‌ష్ట‌మైన హామీఇచ్చిన‌ట్లు స‌మాచారం. తాజాగా గేమ్ ఛేంజ‌ర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల ద్వారా ఆ విష‌యం స్ప‌ష్ట‌మైంది. 

వైసీపీ హ‌యాంలో ఏపీలో తెలుగు సినీప‌రిశ్ర‌మ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ రెడ్డి కొన‌సాగిన ఐదేళ్లూ టాలీవుడ్ ప్ర‌ముఖులు త‌మ సినిమాల రిలీజ్ విష‌యంలోనూ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ విష‌యంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టికెట్ల పెంపు విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ టాలీవుడ్ పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది. ఈ క్ర‌మంలో చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి వంటివారు జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లి చేతులెత్తి దండంపెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయినా, తెలుగు సినీ ఇండ‌స్ట్రీపై జ‌గ‌న్ క‌క్ష‌పూరితంగానే వ్య‌వ‌హ‌రించారు. దీంతో సినిమాల‌కు సంబంధించిన అధిక‌శాతం ఈవెంట్లు హైద‌రాబాద్ లోనే నిర్వ‌హించుకున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌భుత్వం మారింది. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. చంద్ర‌బాబు అంటే సినీ ప‌రిశ్ర‌మ‌కు అభిమాన ముఖ్య‌మంత్రి. మ‌రోవైపు డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉండ‌టంతో సాధార‌ణంగానే సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ఏపీ వైపు చూస్తున్నది. దీనికితోడు ఏపీ స‌ర్కార్ సినీ ఇండ‌స్ట్రీకి అధిక‌ ప్రాధాన్య‌త ఇస్తున్నది. ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్ర‌స్తావించారు. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం సినీ ఇండ‌స్ట్రీ ప‌ట్ల క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపు విష‌యంలో అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. కానీ, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం అలా కాద‌ని.. సినీ ఇండ‌స్ట్రీని త‌గిన విధంగా గౌర‌విస్తుంద‌ని ప‌వ‌న్ చెప్పారు. టాలీవుడ్ హీరోలు వ‌చ్చి త‌మ‌వ‌ద్ద న‌మ‌స్కారాలు చేయాల్సిన ప‌ని లేదంటూ గ‌త ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ తీరుపై ప‌వ‌న్ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న సినీ రంగానికి చెందిన వ్య‌క్తి అయినా, కొంద‌రు సినీ పెద్ద‌లు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసినా వారి జోలికి వెళ్ల‌లేద‌ని, సినీ ప‌రిశ్ర‌మ‌కు రాజ‌కీయ రంగు పూయ‌లేద‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. అదే బాట‌లో కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇదే క్ర‌మంలో టికెట్ల పెంపుపై కొంద‌రు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ప‌వ‌న్ చెక్ పెట్టారు. సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం ఊరికే పెంచ‌డం లేదు.. దాని వ‌ల్ల ప్ర‌భుత్వానికి జీఎస్టీ రూపంలో కొంత ఆదాయం వ‌స్తోంద‌ని, ఈ విష‌యాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ తెలుసుకోవాల‌ని ప‌వ‌న్ అన్నారు. అదే స‌మ‌యంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బ‌ల‌మైన యువ‌త ఉంది. ఇక్క‌డ యువ‌త‌లో ఉన్న శ‌క్తిని వినియోగించుకోవాల‌ని సినీ పెద్ద‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కోరారు. ఏపీలోని ప‌లు చోట్ల స్టంట్ స్కూల్స్ పెట్టండి. సినిమా స్టోరీలు ఎలా రాయాలి.. సినిమా ఇండ‌స్ట్రీలోకి వెళ్లాలంటే ఎలాంటి శిక్ష‌ణ తీసుకోవాలో అందుకు సంబంధించిన ఇనిస్టిట్యూట్స్ ను ఏర్పాటు చేయండి. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న నిపుణుల‌తో యువ‌త‌లో నైపుణ్యాభివృద్ధి పెంచండి. ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ లాంటి వ్య‌క్తుల‌ను తీసుకొచ్చి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే త‌దిత‌ర విష‌యాల‌పై క్లాసులు తీసుకోమ‌ని చెప్పండి. కీర‌వాణి, త‌మ‌న్ లాంటి వాళ్ల ద్వారా సంగీతంపై అవ‌గాహ‌న క‌ల్పించేలా ప్ర‌త్యేక శిక్ష‌ణ‌లు ఇప్పించండి. రాష్ట్రంలోని ప్ర‌ముఖ ప్రాంతాల్లో స్టూడియోలు పెట్టండి. 24 క్రాప్ట్ ల‌కు సంబంధించిన విష‌యాల‌పై సినీ ఇండ‌స్ట్రీపై ఆస‌క్తి క‌లిగిన ఏపీలోని యువ‌త‌కు శిక్ష‌ణ ఇప్పించండ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కోరారు. అలా చేయడానికి ముందుకు వచ్చే వారికి  చంద్ర‌బాబు సార‌థ్యంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. మొత్తానికి గేమ్ ఛేంజ‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా సినీ ఇండ‌స్ట్రీ ఏపీకి రావాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లారిటీ చెప్పారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.