మూలాల ముంగిలికి లాక్కెళ్లే పండుగ.. సంక్రాంతి..!

 


పండుగ అంటే అదొక  ఆనందం.  చదువులు, వృత్తి, ఉద్యోగం, సౌకర్యాలు.. ఇలా కారణాలు ఏవైనా సరే..  పట్టణంలో ఉన్నవారు పండుగ వచ్చిందంటే చాలు పల్లె బాట పడతారు. తెలుగు వారు ఎంతో సంబరంగా చేసుకునే పండుగలలో సంక్రాంతికి ఓ రేంజ్ ఉంది.  భోగి, సంక్రాంతి, కనుమ.. పేరిట ముచ్చటగా మూడురోజులు జరిగే ఈ పండుగ వైభోగం గ్రామాలలో మాత్రమే కనిపిస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లు..  పొంగళ్లు, పిండి వంటలు.. పశువుల అలంకరణ,  కోడి పందేలు.. కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలు.. ప్రేమ, అభిమానం, ఆప్యాయత.. ఒక్కటనేమిటి? సంక్రాంతి పండుగలో లేనిదంటూ ఏదీ లేదు..


భోగి మంటలు, భోగి పళ్లు..


జనవరి 13వ తేదీన భోగి పండుగ.  ఈరోజు ఉదయాన్నే చలికి సవాల్ విసురుతూ ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పాత సామాను నుండి పిడకల హారం వరకు భోగి మంటలలో వేస్తారు.   ఇక ఇదే రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. ఈ భోగి పళ్లలో చెరకు ముక్కలు,  రేగు పళ్లు,  చిల్లర పైసలు, పువ్వులు ఉంటాయి.  ఇలా భోగి పళ్లు పోయడం వెనుక పురాణ కథనం ఉంది.  భోగి పండుగ రోజే బదరీ వనంలో  శ్రీహరిని పసిబిడ్డగా మార్చి దేవతలందరూ రేగుపళ్లు పోశారట.  బదరీ పళ్లనే రేగు పళ్లు అంటారు.  అందుకే కాల క్రమేణా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం ఆచారం అయ్యింది.  పిల్లలకు భోగి పళ్లు పోస్తే ఆ శ్రీహరి ఆశీస్సులు ఉంటాయని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు.


పొంగల్.. సంక్రాంతి..


మూడు రోజులు జరిగే సంక్రాంతి పండుగలో రెండవ రోజు ప్రధాన పండుగ అయిన సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పొంగళ్ల పండుగ అంటారు. ఈ రోజు సూర్యుడి గమనం మారుతుంది.  సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అది కూడా మకర రాశిలోకి ప్రవేశిచడం వల్ల దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతి రోజు పొంగళ్లు వండి నైవేద్యం పెడతారు. చాలా చోట్ల రథం ముగ్గులు వేసి సూర్యుడికి స్వాగతం చెబుతారు.  ఈ రోజు చేసే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.  కొత్తగా పెళ్లైన వారు ఈ పండుగను అత్తారింట్లో చేసుకోవడం, సావిత్రి గౌరీ వ్రతం చేసుకోవడం జరుగుతుంది.


కనువిందు చేసే కనుమ..


సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజు  రైతులు తమకు పంటలు పండించడంలో సహాయపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పశువులను చాలా మంది తమ కుటుంబంలో భాగంగా చూస్తారు.  పశువులకు స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. పశువులకు విశ్రాంతిని ఇస్తారు.  కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో  సంబరాలు చేసుకుంటారు.  కోనసీమ ప్రాంతాలలో కోడి పందెల సందడి సాగుతుంది.  కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారతాయి. కోడి పుంజుల పౌరుషాలు, వాటిలో పోరాట పటిమ ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.  సంక్రాంతి పండుగంటే పల్లెలదే.. పండుగ ఆస్వాదించాలంటే పల్లెకు పోవాల్సిందే..!

                          *రూపశ్రీ.

Related Segment News