దేశం వదిలినా మూలాలు మరిచిపోము..... ప్రవాస భారతీయుల దినోత్సవం..2025..!

 

“ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని,  నిలుపరా నీ జాతి నిండు గౌరవము" అనే గేయాలను చదువుకుంటూ పెరిగినవాళ్లం. దీనికి తగ్గట్టు కొందరు మాతృదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుంటారు.  అలాంటి వారిలో మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద నుండి చాలామంది ప్రముఖులు  ఉన్నారు.  ఈ జాబితాలో ప్రవాస భారతీయుల పాత్ర చాలా ఉంది. ఈ రోజుల్లో పొట్ట కూటి కోసం ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళేవాళ్ళు కొందరైతే, తమ చదువుకి, ప్రతిభకి తగిన అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తున్నవాళ్లు కొందరున్నారు. ఉన్నత విద్య అభ్యసించడానికో.. ఉన్నత విద్య ద్వారా వచ్చిన ఉద్యోగ అవకాశాల కోసమో విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ప్రతి ఏడూ పెరుగుతూ వస్తోంది. దీనికి తగ్గట్టే విదేశాలలో భారతీయుల హవా సాగుతోంది.     మన భారతదేశం నుంచి ప్రపంచ నలుమూలలకి వెళ్ళిన మన వాళ్ళు భారతీయతను చాటి చెప్పటానికి మన దేశ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారు.  అలాంటి  ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలున్న వ్యక్తులు దేశ అభివృద్ధిలో చేసిన, చేస్తున్న సేవలకి గుర్తింపుగా ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటారు. అయితే దీనికి ముఖ్యమైన మూలం మహాత్మా గాంధీ..   మహాత్మా గాంధీ విద్యాభ్యాసం కోసం దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడి  నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజునే ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటున్నారు.   2003 సంవత్సరం నుంచి  ప్రతీ ఏటా జనవరి 9వ తేదీన   ప్రవాస భారతీయుల  దినోత్సవం( ఎన్‌ఆర్‌ఐ డే)  జరుపుకుంటున్నాము. ప్రవాస భారతీయుల దినోత్సవం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుంటే..


2025 లో జరగబోయే 18వ ఎన్‌ఆర్‌ఐ డే  ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్‌లో జనవరి 8 నుండి 10 వతేదీ వరకు  జరగనుంది.

ప్రవాస భారతీయ దినోత్సవం..

మన భారతదేశం  ప్రపంచంలోనే  ఎక్కువ ప్రవాస భారతీయులు ఉన్న దేశంగా పేరుపొందింది. ఈ ప్రవాస భారతీయులు తమ   ఆర్థిక సహకారాలు, పెట్టుబడులు ద్వారా దేశ అభివృద్ధిలో, గ్లోబల్‌గా మన దేశ గుర్తింపుని  పెంచటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్ద పెద్ద కంపెనీల సి‌ఈ‌ఓలు, రాజకీయ నాయకులు ఇలా చాలామంది మన దేశం వారు లేదా మన దేశ మూలాలున్న వారు విదేశాలలో  ఉన్నారు.  అందుకే ఈ ప్రవాస భారతీయుల దినోత్సవం  వ్యాపారం, విద్య, కళలు, శాస్త్రం, సాంకేతికత వంటి రంగాలలో  ప్రవాస భారతీయుల విజయాలను గుర్తించి, ప్రోత్సహించడమే కాకుండా అంతర్జాతీయంగా  భారతదేశ ప్రతిష్టను మరింత బలోపేతం చేయడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. మన దేశంతో వారి సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి,  భారతీయ మూలాలున్న వ్యక్తులు,  భారతీయ సంస్థల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించటానికి ,  అలాగే ఎన్‌ఆర్‌ఐ లను  ప్రభావితం చేసే ప్రభుత్వ విధానాలపై చర్చించటానికి ఈ ప్రవాస భారతీయుల దినోత్సవం  ఒక వేదికగా  నిలుస్తుంది.


భవిష్యత్తులో వివిధ రంగాలలో భారతదేశ అభివృద్ధికి వనరులను, నైపుణ్యాలను, సాయాన్ని  సమీకరించడం కోసం ప్రవాస భారతీయుల సహకారం చాలా అవసరం అవుతుంది.  దీనికి గానూ వారు ఎలా సహకరించగలరో చర్చించేందుకు ఒక  ప్రవాస భారతీయుల దినోత్సవం ఒక వేదిక అవుతుంది.

ప్రవాసీయుల సహకారం.. భారతదేశ కలకు సాకారం..


ఏదైనా ఒక దినోత్సవం జరపడం మొదలుపెడితే ప్రతి ఏడాది ఒక విశేషమైన అంశాన్ని ఎంచుకుని ఆ అంశం దిశగా కృషి చేయడం, లక్ష్యాలు సాధించడం జరుగుతుంది.  ప్రవాస భారతీయుల దినోత్సవానికి అలాంటి అంశాల ఎంపిక ఉంది.  ఈ ఏడాది..     “అభివృద్ధి చెందిన భారతదేశపు సంకల్పంలో  ప్రవాస భారతీయుల సహకారం”  అనే అంశాన్ని  ఎంపిక చేశారు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశ జాబితా నుంచి అభివృద్ధి చెందిన దేశ జాబితాలో మన దేశం చేరేందుకు గానూ  విదేశాలలో ఉండే భారతీయుల  పాత్రని  ఈ అంశం ప్రతిబింబిస్తుంది.  

 సేవ..  గుర్తింపు..

ఈ ఎన్‌ఆర్‌ఐ దినోత్సవం జరుపుకోవడంలో భాగంగా అందరిని ఆకట్టుకునే ప్రధాన విషయం.. సేవలను గుర్తించడం. ఇవే..  ‘ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులు’. ఇవి భారతీయ ఎన్‌ఆర్‌ఐ లు  చేసిన అసాధారణ సేవలను గుర్తించి సత్కరించేందుకు ఇచ్చే పురస్కారాలు. ఈ అవార్డులు భారత రాష్ట్రపతి చేతులు మీదుగా అందజేయబడతాయి. ఈ గుర్తింపు  భవిష్యత్తులో భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులకి  మధ్య మరింత సహకారం పెరిగేలా చేస్తుంది.

ఈ సారి ప్రవాస భారతీయుల దినోత్సవానికి  వేదిక అయిన భువనేశ్వర్ 50 కంటే ఎక్కువ దేశాల నుండి వచ్చే ప్రవాస భారతీయులను హృదయపూర్వకంగా స్వాగతించనుంది. ఈ సంవత్సరం కార్యక్రమానికి ట్రినిడాడ్ & టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగం ఇవ్వబోతున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు ప్రవాస భారతీయులను ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.  మొదటి రోజు యూత్ ప్రవాస భారతీయ దివస్‌కు కేటాయించబడింది. ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖతో కలిసి నిర్వహించనున్నారు. ఇది యువ నాయకత్వం,  సాధికారతపై దృష్టి సారిస్తుంది. ప్రసిద్ధి చెందిన డెవ్ ప్రగాద్ (సి‌ఈ‌ఓ, న్యూస్వీక్) వంటి ప్రసంగకర్తలు ఇందులో పాల్గొంటారు. ఈ సంధర్బంగా మన దేశ యువత కూడా తమ ప్రతిభా నైపుణ్యాలని సరిగా ఉపయోగించుకుని, దేశం వీడినా దేశ సేవ చేస్తున్న  ప్రముఖ ప్రవాస భారతీయులను ఆదర్శంగా తీసుకుని  తమ జీవితాలని మెరుగుపర్చుకోవటమే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా భాగం అయితే భారతదేశం అభివృద్ది చెందిన దేశం అవుతుంది.


                                                *రూపశ్రీ.

Related Segment News