నార్సింగి లో రాష్ట్రకూటుల కాలపు నంది విగ్రహం

కాపాడుకోవాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి 

హైదరాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీ, ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్లక్ష్యంగా పడి ఉన్న రాష్ట్రకూటుల కాలపు నంది విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. నార్సింగి, నేక్ నాంపేట ప్రధాన రహదారిలో గల ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని శివాలయం వెనక గల ఎర్ర ఇసుక రాతిలో రెండు అడుగుల పొడవు, అడుగు మూడుఅంగుళాల ఎత్తు, 9 అంగుళాల మందంతో చెక్కిన ఈ నంది ఒంటిపై గంటల పట్టెడలు, గంగడోలు, మూపురం, ముఖ భాగం, శిల్ప శైలి 9వ శతాబ్ది నాటి రాష్ట్రకూటల రాజుల శిల్ప కళకు అద్దం పడుతోందని అన్నారు. శుక్రవారం ఆ విగ్రహాన్ని సందర్శించిన శివనాగిరెడ్డి, ముట్టె భాగంలో భిన్నమైన చారిత్రక ప్రాధాన్యత గల ఈ నంది శిల్పాన్ని ఆలయ ప్రాంగణంలోనే పీఠంపై నిలబెట్టి, భద్రపరచాలని ఆలయ అర్చకులు, ధర్మకర్తలకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.